
- గుడిహత్నూర్ మండలం తోయగూడలో గంజాయి సాగు
గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోయగూడలో రూ.67 లక్షల విలువ చేసే 627 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు.
గుడిహత్నూర్ మండలం తోయగూడ గ్రామ శివారులో తోషం గ్రామానికి చెందిన మర్సుకోల దేవరావు, మర్సుకోల జగన్, మర్సుకోల నగేశ్ తమ వ్యవసాయ భూమిలో పత్తి పంట మధ్య గంజాయి మొక్కలను సాగు చేశారని చెప్పారు. గురువారం సీసీఎస్, ఇచ్చోడ సర్కిల్ పోలీసులు దాడి చేసి 627 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వీటి విలువ రూ.62.70 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితులపై కేసులు నమోదు చేసి, దేవరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించామని తెలిపారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
అశ్వారావుపేట/దమ్మపేట: ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీసులు, కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు డీఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. దమ్మపేటలో మీడియాకు వివరాలు వెల్లడించారు.
మండలంలోని పట్వారి గూడెం వాహన తనిఖీల్లో ఇన్నోవాలో నాలుగు బస్తాల్లో తరలిస్తున్న 85 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ రూ.43 లక్షలు ఉంటుందన్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం నుంచి మోతుగూడెంకు డిప్యూటేషన్ పై వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ పనగుడు శివకృష్ణ, తమిళనాడుకు చెందిన జయరామన్ మహేశ్, కృష్ణమూర్తి మారియప్ప, కందస్వామి రజిత్, రాము వసంత్ పట్టుబడగా, మరో ముగ్గురు పరారైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.