సిద్దిపేట జిల్లాలో ముంపు నివారణకు చర్యలు

సిద్దిపేట జిల్లాలో ముంపు నివారణకు చర్యలు
  • కోమటి చెరువు ఫీడర్ చానల్ చుట్టూ ఫెన్సింగ్, రోడ్డు నిర్మాణం
  • బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ ఆక్రమణల తొలగింపుపై చర్యలు
  • నోటీసులు జారీ చేస్తున్న సిద్దిపేట బల్దియా అధికారులు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణంలో వరద నివారణ చర్యలకు బల్దియా అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కోమటి చెరువు ఫీడర్ చానల్ పొంగి పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. భవిష్యత్​లో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఫీడర్ చానల్ చుట్టూ రోడ్డుతో పాటు ఫెన్సింగ్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పక్షం రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు  వరదనీరు కాలనీల్లోకి  చేరడంతో స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ రోడ్డులోని బ్రిడ్జి పై నుంచి భారీగా వరద నీరు ప్రవహించడంతో ఆరు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన వరదలతో కోమటి చెరువు ఫీడర్ చానల్ సమీపంలోని ప్రజలు అల్లాడిపోయారు. 

రెండు దశాబ్దాల కింద ఫీడర్ చానల్ పునరుద్ధరణ

సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు సుందరీకరణలో భాగంగా ఫీడర్ చానల్ ను పునరుద్ధరించారు. ప్రతీ వర్షాకాలం సీజన్ లో  కోమటి చెరువుకు ఎగువనున్న తొగుట, తడకపల్లి, ఎన్సాన్ పల్లి చెరువుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కోమటి చెరువు నుంచి  దిగువన నర్సాపూర్ చెరువుకు మత్తడి కాల్వ ఉన్నా చాలా వరకు మట్టితో నిండిపోవడంతో ఆక్రమణలకు గురైంది. ఈ నేపథ్యంలో మూడు కిలోమీటర్ల మేర ఫీడర్ చానల్ ను పునరుద్ధరించి వరద నీరు సాఫీగా వెళ్లేలా చేశారు.

ఆక్రమణల తొలగింపునకు చర్యలు

సిద్దిపేట పట్టణంలో కొన్ని కాలనీలు వరద ముంపునకు గురవడంతో కోమటి చెరువు ఫీడర్ చానల్ చుట్టూ బఫర్ జోన్లలోని అక్రమణ నిర్మాణాల తొలగింపునకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ బ్రిడ్జి నుంచి నర్సాపూర్ చెరువు వరకు ఆక్రమణలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. భవిష్యత్​లో బఫర్ జోన్లను ఆక్రమించకుండా ఫీడర్ చానల్  రెండు వైపులా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాల్ని నిర్ణయించారు. దీని వల్ల ఫీడర్ చానల్ ను  ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని భావిస్తున్నారు. భవిష్యత్​లో వరద నీరు వచ్చినా ఫీడర్ చానల్ పొంగకుండా ఎత్తు పెంచడంతో పాటు ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

ఆక్రమణల తొలగింపునకు చర్యలు

బఫర్ జోన్ ను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చడానికి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇండ్ల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలను కూల్చి వేస్తాం. భవిష్యత్​లో వరద ముంపునకు గురికాకుండా ఉండేందుకు  ఫీడర్ చానల్ రెండు వైపులా రోడ్డు నిర్మాణంతో పాటు ఎత్తు పెంచి ఫెన్సింగ్ నిర్మిస్తాం. 
అశ్రిత్ కుమార్, మున్సిపల్ కమిషనర్, సిద్దిపేట

బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ఆక్రమణలతో ఇక్కట్లు

కోమటి చెరువు ఫీడర్ చానల్ కు ఇరువైపులా పది మీటర్ల బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దనే నిబంధన ఉంది. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఫీడర్ చానల్ బఫర్ జోన్లను, నర్సాపూర్ ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమించి నిర్మాణాలు  చేశారు. అంతేకాకుండా ఫీడర్ చానల్ లో  చెత్త, సీల్ట్ ను ఎప్పటికప్పుడు తీయకపోవడంతో ఇటీవల వర్షాలకు పట్టణంలోని కొంత భాగం  వరద ముంపునకు గురైంది.