అల్ ఖైదా చీఫ్ ను ఈ విధంగా హతమార్చిన అమెరికా

అల్ ఖైదా చీఫ్ ను ఈ విధంగా హతమార్చిన అమెరికా

ఉగ్రవాదం అంటే ప్రధానంగా గుర్తుకొచ్చేది అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్. అమెరికాలోని ట్విన్ టవర్స్ కూల్చివేతతో బిన్ లాడెన్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. అల్ ఖైదా ఇంత దారుణంగా వ్యవహరిస్తుందా అని అంతా షాకయ్యారు. ఆ తర్వాత లాడెన్ ను వెంటాడిన అమెరికా ఎట్టకేలకు పాకిస్తాన్ లో ఉన్నట్టు గుర్తించి మట్టుపెట్టింది. ఇప్పుడు అల్ ఖైదా చీఫ్ గా ఉన్న అయ్ మన్ అల్ జవహరీని కూడా అమెరికా మట్టుపెట్టింది. అమెరికాపై అల్ ఖైదా మారణహోమానికి మాస్టర్ మైండ్ ఇతనే. లాడెన్ చనిపోయాక..అల్ ఖైదాకు అన్నీ తానయ్యారు. లాడెన్ ను మట్టుపెట్టినట్టుగానే ఇతడినీ ఖతం చేసింది అమెరికా. 

జవహరీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చనిపోయాడానికి కొన్నేళ్ల కిందటే వార్తలొచ్చాయి. కానీ అమెరికా మాత్రం అతడిని వేట మానలేదు. ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు కైవసం చేసుకున్నాక జవహరీ కాబూల్ లో ఉన్నాడని అమెరికాకు సమాచారం అందింది. మే నెల నుంచి అతని ప్రతీ కదలికను అబ్జర్వేషన్ లో పెట్టింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు.? ఎన్నిసార్లు బాల్కనీ పైకి వస్తున్నాడు.? ఏయే సమయాల్లో వస్తున్నాడు..? ఎంత సేపు అక్కడ ఉంటున్నాడనే అంశాలపై మూడు నెలలుగా పూర్తిగా అధ్యయనం చేశాయి అమెరికా బలగాలు. సోమవారం సాయంత్రం కూడా జవహారీ తన అనుచరులతో బాల్కనీపై సమావేశమయ్యాడు. అదును కోసం చూస్తున్న అమెరికా.. అక్కడికక్కడే డ్రోన్‌ సాయంతో మిసైల్స్ ప్రయోగించడంతో జవహరీ స్పాట్ లోనే చనిపోయాడు. 
 
మిసైల్ కి పదునైన ఆరు బ్లేడ్లు

ఎలాంటి పేలుడు లేకుండా..అత్యాధునిక మిసైల్స్ తో పని పూర్తి చేసింది. అతని చుట్టుపక్కన ఉన్నవారికి, కుటుంబసభ్యులకూ ఏమీ కాలేదని తెలుస్తోంది. సాధారణంగా మిస్సైల్స్ కి వార్ హెడ్ ఉంటుంది. అంటే దాని మొదటి భాగంలో పేలుడు పదార్థాలుంటాయి. కానీ హెల్ ఫైర్ ఆర్ 9 ఎక్స్ మిసైల్.. గా పిలిచే ఇందులో పేలుడు పదార్థాలుండవు. మిసైల్ కి పదునైన ఆరు బ్లేడ్లు ఉంటాయి. ఇవి నేరుగా టార్గెట్ ను ఛేదిస్తాయి. జవహరీని కూడా ఇదే విధంగా చంపేసినట్టు అమెరికా ప్రకటించింది.జవహరీ అమెరికా జాతీయ భద్రతకు సవాలుగా మారడంతో అతన్ని హతమార్చామని అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. జవహరీ హతం కావడంతో అల్ ఖైదాతో పెద్ద ఎదురుదెబ్బ  తగిలినట్టేనని ఆయన కామెంట్ చేశారు. 

గతంలోనూ ఇలాంటి మిసైల్స్ ప్రయోగించింది అమెరికా. 2017 మార్చిలో అల్ ఖైదా సీనియర్ లీడర్ అబూ అల్ ఖయర్ అల్ మాసిర్ ను సిరియాలో హతం చేసింది. అతడు కారులో ప్రయాణిస్తుండగా అతనిపై మొదటిసారి డ్రోన్ ద్వారా ఆర్ 9 ఎక్స్ మిసైల్ ని ప్రయోగించారు. నాటి ఆ ఘటనలో ఆ కారు పైభాగంలో పెద్ద రంద్రం పడి..అందులోని వారు చనిపోయారు. కానీ వాహనం ముందు, వెనక భాగాలు, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎలాంటి విధ్వంసం జరగలేదు. ఈ దాడి తర్వాతే అమెరికా దగ్గర ఇలాంటి అత్యాధునిక మిసైల్స్ ఉన్నాయని ప్రపంచానికి తెలిసింది. 

జవహరీకి చిన్నతనం నుంచే మతచాంధస భావాలు ఎక్కువ

జవహరీ 1951 జూన్‌ 19న ఈజిప్టు రాజధాని కైరో శివారు ప్రాంతంలో ఓ మధ్యతరగతి విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. అతడి కుటుంబంలో చాలా మంది వైద్యులు, స్కాలర్లు ఉన్నారు. తండ్రి మహమ్మద్ అల్ జవహరీ స్థానిక కైరో యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. తండ్రి బాటలోనే జవహరీ కూడా ఇదే యూనివర్శిటీలో 1974లో మెడిసిన్‌ లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాడు. ఆ తర్వాత సర్జరీలో మాస్టర్స్‌ పూర్తి చేసి కొంతకాలం పాటు కంటి శస్త్ర చికిత్స నిపుణుడిగా పనిచేశాడు. జవహరీకి చిన్నతనం నుంచే మతచాంధస భావాలు ఎక్కువగా ఉన్నాయి. 15ఏళ్ల వయసులోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తోన్న ఓ గ్రూప్ లో సభ్యుడిగా చేరి అరెస్టయ్యాడు. ఆ తర్వాత డాక్టర్ గా ఉండలేక పూర్తిగా ఉగ్రవాద కార్యకలాపాల వైపు వెళ్లిపోయాడు. 

ఒసామా బిన్ లాడెన్ తో స్నేహం

1973లో ఈజిప్టియన్‌ ఇస్లామిక్‌ జిహాద్‌ తీవ్రవాద సంస్థ ఏర్పడింది. జవహరీ అందులో చేరాడు. 1981లో అప్పటి ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్‌ సదత్‌ కైరోలోని ఓ మిలిటరీ పరేడ్‌ లో హత్యకు గురయ్యారు. ఈ ఘటన తర్వాత జరిగిన అరెస్టుల్లో జవహరీ కూడా అరెస్టయ్యాడు. అయితే కేసు నుంచి నిర్దోషిగా బయటపడినా అక్రమంగా ఆయుధాలు వాడినందుకు మూడేళ్లు జైళ్లో ఉండాల్సి వచ్చింది. జైలులో మరింత ఎక్కువగా ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు జవహరీ. 1985లో జైలు నుంచి విడుదలైన తర్వాత జవహరీ సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. సౌదీ అరేబియా వెళ్లాక ఒసామా బిన్ లాడెన్ తో స్నేహం ఏర్పడింది. తర్వాత అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, మధ్య ఆసియా దేశాల్లో లాడెన్ తో కలిసి అల్ ఖైదా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అప్పటి నుంచి జవహరీని లాడెన్ కు రైట్ హ్యాండ్ గా చెబుతుంటారు. 

ట్విన్ టవర్స్ దాడిలో జవహారీ కీ రోల్

ఈజిప్టులో ఇస్లామిక్‌ జిహాదీని అల్ ఖైదాలో కలిపాడు జవహరీ. 1990లో యూరప్ దేశాల్లో పర్యటించిన జవహరీ..అల్‌ఖైదాకు విరాళాలు సేకరించాడు. 1997లో అఫ్గానిస్థాన్‌లోని జలాలాబాద్‌కు మకాం మార్చాడు. ఇక్కడి నుంచే లాడెన్ కూడా తన కార్యకలాపాలు కొనసాగించేవాడు. లాడెన్, జవహరీ, మరికొన్ని ఉగ్రవాద సంస్థల నాయకులు కలిసి వరల్డ్‌ ఇస్లామిక్ ఫ్రంట్‌ ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్‌ ఆధ్వర్యంలోనే కెన్యా, టాంజానియాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 

అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి ప్రణాళిక, అమలు అంతా జవహరీనే చూసుకున్నాడు. దీనికోసం ప్రత్యేకంగా ఆత్మాహుతి దళాలను తయారుచేశాడు. పక్కా ప్లానింగ్ తో 2001 సెప్టెంబర్ 11న పేలుడు పదార్థాలు నింపిన విమానంతో ఢీకొట్టించి ట్విన్ టవర్స్ ని పేల్చేశాడు. ట్విన్ టవర్స్ పై దాడి తర్వాత అతనిపై అమెరికా సీరియస్ గా ఫోకస్ పెట్టడంతో చాలా రోజులు కనిపించకుండా పోయాడు. అండర్ గ్రౌండ్ లో ఉన్నా..తన పనులు మాత్రం ఆపలేదు. అమెరికా నిఘా పెట్టినా అల్ ఖైదాను మరింత యాక్టీవ్ చేస్తూ పోయాడు.

నెక్స్ట్ అల్ ఖైదా చీఫ్ ఎవరు..?

2011లో లాడెన్‌ ను అమెరికా దళాలు చంపేశాక అల్‌ ఖైదా చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నాడు. ఆఫ్గనిస్తాన్ ను తాలిబాన్లు తిరిగి స్వాధీనం చేసుకోవడంలోనూ ఇతను కీలక పాత్ర పోషించాడని చెబుతుంటారు. అయ్‌ మన్ అల్ జవహిరి మరణంతో ఇప్పుడు అల్ ఖైదా బాధ్యతలు ఎవరు చేపట్టబోతున్నారన్న దానిపై అగ్రరాజ్యం ఫోకస్ పెట్టింది. అయితే..అల్ ఖైదా తర్వాతి చీఫ్ రేసులో నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. అల్‌ ఖైదా ఇన్ ది ఇస్లామిక్ మఘ్రెబ్ కు చెందిన సైఫ్ అల్ అడెల్, అబ్దల్ రహమాన్ అల్ మఘ్రెబి, యాజిడ్ మెబ్రాక్,  అల్ షబాబా ఉగ్రవాద సంస్థకు చెందిన అహ్మద్ దిరియే.. ఈ పోస్ట్ రేసులో ఉన్నారని తెలుస్తోంది. తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్థాన్‌ లో అల్‌ఖైదా కార్యకలాపాలు స్వేచ్ఛగా జరుగుతున్నాయి. తాలిబాన్ సర్కారుకు సలహాలివ్వడం వరకే పరిమితమవుతోందని.. డైరెక్ట్ గా ఎక్కడా దాడుల్లో పొల్గొనడం లేదని తెలుస్తోంది.