జవహరిని వెంటాడి చంపిన ‘హెల్​ఫైర్’ ​మిసైల్స్​

జవహరిని వెంటాడి చంపిన ‘హెల్​ఫైర్’ ​మిసైల్స్​

వాషింగ్టన్​: అంతర్జాతీయ టెర్రరిస్టు​ సంస్థ అల్​కాయిదా ఊహించని షాక్ ​తగిలింది. ఆ సంస్థ చీఫ్, 9/11 టెర్రరిస్టు దాడుల్లో కీలక పాత్ర​పోషించిన అయిమన్​అల్ ​జవహరి(71) ని అమెరికా హతం చేసింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్​లో అతను ఉంటున్న ఇంటిపై డ్రోన్లు ప్రయోగించి ‘ప్రెసిషన్​ స్ట్రయిక్​’తో జవహరిని మట్టుబెట్టింది. గత నెల 30న సెంట్రల్ ​ఇంటెలిజెన్స్​ఏజెన్సీ(సీఐఏ) ఈ దాడులు చేసింది. న్యాయం జరిగిందని, టెర్రరిస్టు హతమయ్యాడని అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్  ​ప్రకటించారు. సోమవారం వైట్​హౌస్​లో ఆయన మాట్లాడారు. ‘‘జవహరిని ఖతంచేసేలా ప్రెసిషన్ ​స్ట్రయిక్  ​కోసం నేను ఆదేశించాను. 2,977 మందిని పొట్టన పెట్టుకున్న 9/11 టెర్రర్ ​దాడుల్లో జవహరి హస్తం ఉంది. కొన్ని దశాబ్దాల పాటు అమెరికన్లపై జరిగిన టెర్రర్​ దాడుల్లో అతడే మాస్టర్​మైండ్. ప్రెసిషన్ ​స్ట్రయిక్ ​గురించి అధికారులు నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నారు. అసాధారణమైన పట్టుదల, నైపుణ్యంతో చేసేదే  ప్రెసిషన్ ​స్ట్రయిక్. ఇప్పుడా టెర్రరిస్టు లేడు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎవరూ దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. మనకు(అమెరికన్లకు) హాని కలిగించాలనుకునే వారెవ్వరినీ మేం వదిలిపెట్టం. అమెరికన్లను కాపాడేందుకు ఎప్పటికప్పుడు శాయశక్తులా పోరాడుతూనే ఉంటాం. జవహరిని మట్టుబెట్టడంతో 2001 బాధితులకు కాస్త ఊరట కలిగినట్లయింది” అని బైడెన్​ అన్నారు. ‘‘ఈ మిషన్​ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాం. జవహరి తప్ప ఇతరులు ఈ అటాక్​లో గాయపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వారం క్రితం అధికారులు నాకు చెప్పారు. దీంతో ఈ మిషన్​కు నేను ఆమోదం తెలిపాను” అని బైడెన్​ వెల్లడించారు. అఫ్గానిస్తాన్ ​నుంచి తన బలగాలను అమెరికా ఉపసంహరించుకున్న సరిగ్గా ఏడాది తర్వాత ఈ దాడి జరగడం విశేషం.

జవహరి తలపై  రూ.196 కోట్ల రివార్డు

2011లో ఒసామా బిన్​ లాడెన్​ హతమైన తర్వాత అల్​ఖాయిదా చీఫ్​గా బాధ్యతలు చేపట్టిన జవహరి తలపై  రూ.196 కోట్ల రివార్డును ప్రకటించారు. కాబూల్​లో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడనే పక్కా సమాచారం అందడంతో అమెరికా మిసైళ్లతో కూడిన డ్రోన్లను ప్రయోగించింది. రెండు మిసైళ్లు డ్రోన్ ​నుంచి బయటకు వచ్చి అతను ఉంటున్న బాల్కనీలోకి దూసుకెళ్లాయి. ఈ ప్రెసిషన్ ​స్ట్రయిక్​లో జవహరి ఒక్కడే చనిపోయాడని, మిగతా కుటుంబ సభ్యులెవరికీ గాయాలుకాలేదని అధికారులు తెలిపారు. 2000 అక్టోబరులో అమెరికా కోల్​నావల్ ​డెస్ట్రాయర్​పై జరిగిన 
సూసైడ్​ బాంబింగ్​లో జవహరి హస్తం ఉందని వారు చెప్పారు. ఆ దాడిలో 17 మంది అమెరికా నావికులు చనిపోయారు. కాగా జవహరిని చంపడం ద్వారా అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఉల్లంఘించిందని తాలిబన్లు ఆరోపించారు. అమెరికా తన ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించిందని తాలిబన్ ​ప్రతినిధి 
జబీవుల్లా ముజాహిద్ ట్వీట్​ చేశారు.

వెతికి వెంటాడి చంపే మిసైళ్లు

అఫ్గాన్​లోని కాబూల్​లో జవహరి ఓ సేఫ్​హౌస్​లో తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఇంతకుముందు పాకిస్తాన్​లో ఉన్న జవహరి.. తాలిబన్ల సపోర్టుతో అక్కడికి మారాడు. జవహరి కొత్త అడ్రస్​ వివరాలను తమ ఇంటెలిజెన్స్ నెట్​వర్క్​తో సేకరించి, అతడిని మట్టు బెట్టేందుకు ప్లాన్​ చేసినట్లు అమెరికన్​ ఆఫీసర్​ ఒకరు చెప్పారు. గత నెల 30న సాయంత్రం 6.18 గంటలకు బాల్కనీలో కూచున్న జవహరిపై రెండు ‘హెల్​ఫైర్ ​మిసైల్స్​’ దాడి చేశాయి. ఈ మిసైల్స్​ను ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఎలాంటి పేలుళ్లు జరగకుండానే, మూలన దాక్కున్న టార్గెట్లను గుర్తించి, ఆ టార్గెట్​ను అత్యంత కచ్చితత్వంతో ఈ మిసైల్స్​ఛేదిస్తాయి. ఇతరులను గాయపరచకుండా, ఆస్తులకు నష్టం కలిగించకుండా టార్గెట్​ను తుదముట్టించ డం వీటి ప్రత్యేకత. హెల్​ఫైర్ ​మిసైల్స్ 5 ఫీట్ల పొడవు, 45 కిలోల బరువు ఉంటాయి. వార్​హెడ్​, గైడెన్స్​సిస్టమ్​, ఫిజికల్​ వేరియేషన్​ అని ఈ మిసైళ్లలో వివిధ రకాలు ఉంటాయి. పాప్​ ఔట్ ​స్వార్డ్ ​బ్లేడ్లను ఉపయోగించే హెల్​ఫైర్ ​ఆర్​9ఎక్స్ ​ప్రస్తుతం ఉన్నవాటిలో లేటెస్టుది. బిల్డింగు లు, కార్లలో దాక్కున్న శత్రువులను సైతం ఈ రకం మిసైళ్లు వెంటాడి చంపుతాయి. ఈ మిసైళ్ల ను ‘ఫ్లయింగ్​ గిన్సు’ అని కూడా అంటారు. ఒబామా హయాంలో వీటిని డెవలప్​ చేశారు.

ఎవరీ జవహరి ?

ఈజిప్ట్​లోని గీజాలో పేరున్న కుటుం బంలో 1951 జూన్​19న జవహరి పుట్టాడు. కొన్నాళ్లు సర్జన్​గా పనిచేశా డు. అనంతరం టెర్రరిజం వైపు వెళ్లాడు. 1981లో ఈజిప్ట్​ ప్రెసిడెంట్​ అన్వద్​సాదత్ హత్యలో పాల్గొని మూడేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించాడు. అలా ముస్లిం మిలిటెంట్​గా బయటి ప్రపంచానికి పరిచమయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక పాకిస్తాన్​కు వెళ్లాడు. అఫ్గాన్​లో సోవియట్​పై పోరాడి, గాయపడిన ముజాహిదీన్​ఫైటర్లకు వైద్యం చేశాడు. అప్పడే లాడెన్​ను కలిశాడు. అమెరికాపై దాడులు చేయాలని ఇద్దరూ డీల్​కుదుర్చుకున్నారు. 1998లో కెన్యా, టాంజానియాలో అమెరికా ఎంబసీలపై జరిగిన దాడుల్లోనూ జవహరి కీలకపాత్ర పోషించాడు. 1997లో ఈజిప్ట్​ పర్యటించిన విదేశీ టూరిస్టులపై జరిగిన హత్యలో కూడా పాలుపంచుకున్నాడు. ఆ తర్వాత 2001లో అమెరికాలో ట్విన్ ​టవర్లపై జరిగిన అటాక్​లో కూడా అతను మాస్టర్​మైండ్​గా ఉన్నాడు. 2014లో భారత ఉపఖండంలో అల్​ఖైదా బ్రాంచులను స్థాపించాడు.