ఇజ్రాయెల్ ​ఎయిర్​పోర్ట్​పై హౌతీల మిసైల్​దాడి

ఇజ్రాయెల్ ​ఎయిర్​పోర్ట్​పై హౌతీల మిసైల్​దాడి
  • ఎయిర్​పోర్ట్​ మెయిన్ ​టర్మినల్​ సమీపంలో పడ్డ క్షిపణి 
  • 25 మీటర్ల లోతు ఏర్పడ్డ గొయ్యి.. 8 మందికి గాయాలు

టెల్​ అవీవ్​: ఇజ్రాయెల్​ విమానాశ్రయంపై హౌతీలు మిస్సైల్​తో దాడి చేశారు. యెమెన్ నుంచి హౌతీలు ప్రయోగించిన క్షిపణి.. టెల్​ అవీలోని బెన్ గురియన్ విమానాశ్రయం  ప్రధాన టెర్మినల్ సమీపంలో పడటంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఆ ప్రాంతంలో 25 మీటర్ల లోతులో గొయ్యి ఏర్పడింది.  క్షిపణి దాడితో విమానాశ్రయంలో కార్యకలాపాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. క్షిపణిని అడ్డుకునేందుకు తాము చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని, విమానాశ్రయం సమీపంలో ల్యాండ్ అయ్యేలోపు పొగలు కమ్ముకున్నాయని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్​) తెలిపాయి.

ఇజ్రాయెల్​కు ఫ్లైట్స్​ బంద్: ఎయిర్​ ఇండియా

ఇజ్రాయెల్​ రాజధాని టెల్​అవీవ్​కు భారత్​నుంచి 2 రోజులపాటు విమాన సేవలు నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం  బెన్ గురియన్ విమానాశ్రయంలో హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో ఎయిర్​ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ సంఘటన తర్వాత ఢిల్లీ నుంచి టెల్ అవీవ్‌‌కు వెళ్లే విమానాన్ని అబుదాబికి మళ్లించామని ఎయిర్‌‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. చెల్లుబాటు అయ్యే టిక్కెట్లు ఉన్నవారికి మినహాయింపు లేదా రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.