ఆడపిల్లలకు హెచ్‌పీవీ టీకా

ఆడపిల్లలకు హెచ్‌పీవీ టీకా

హైదరాబాద్‌, వెలుగు: సర్వికల్‌ క్యాన్సర్‌ (గర్భాశయ క్యాన్సర్‌‌). ప్రపంచవ్యాప్తంగా ఆడవారిని భయపెడుతున్న వ్యాధి. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న రోగం. ఇండియాలో ఏటా సగటున 97 వేల మంది దీని బారినపడుతున్నారు. ఏటా 65 వేల మందికిపైగా చనిపోతున్నారు. రాష్ట్రంలోనూ ఇప్పుడిప్పుడే పడగ విప్పుతోంది. నివారణకు ప్రపంచంలో చాలా దేశాలు యాంటీ హ్యూమన్‌‌‌‌ పాపిలోమా వైరస్‌(హెచ్‌పీవీ) వ్యాక్సిన్ వాడుతున్నా అపోహలతో దేశంలో ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రామ్‌లో చేర్చలేదు. అయినా కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బాలికలకు (9 నుంచి 14 ఏళ్లు) ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాధి విస్తరణ, అరికట్టాల్సిన అవసరంపై ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి డాక్టర్లు ప్రభుత్వానికి నివేదికిచ్చి వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌లో హెచ్‌పీవీని చేర్చాలని సూచించారు. ప్రభుత్వ డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు రోగం స్ర్కీనింగ్‌పై క్లాసులూ నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. రోగాన్ని సులభంగా గుర్తించే పద్ధతులపై నిపుణులతో శిక్షణ ఇప్పించనున్నారు.

ఇండియానే టాప్‌

సర్వికల్ క్యాన్సర్‌ కేసుల్లో ప్రపంచంలో ఇండియానే టాప్‌లో ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 5.27 లక్షల మంది ఈ రోగం బారిన పడితే దేశంలో 97 వేల మంది దీనితో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 2.65 లక్షల మంది మరణిస్తుంటే ఇండియాలో 65 వేల మందికి పైగా చనిపోతున్నారు. అయినా అనుమానాలతో ఇక్కడి ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో టీకాను చేర్చలేదు. దేశంలో ఢిల్లీ, సిక్కిం రాష్ట్రాలే ఈ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌ సర్కారు కూడా బాలికలకు హెపీవీ టీకా ఇవ్వాలని నిర్ణయించింది. స్టేట్‌ ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రామ్‌లో చేర్చింది. రాష్ర్టంలోనూ ఈ డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. తాజాగా మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌ డైరెక్టర్‌ జయలలిత చెప్పారు.

రాష్ట్రంలో 7 వేల అనుమానిత కేసులు

రాష్ర్టంలోనూ సర్వికల్ క్యాన్సర్‌‌ ప్రభావం బాగానే ఉంది. నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌లపై గతేడాది నుంచి చేస్తున్న సర్వేలో దీన్నీ‌ స్ర్కీనింగ్‌ చేస్తున్నారు. ఇప్పటివరకూ 7 వేల మంది అనుమానిత కేసులను గుర్తించారు. సర్వే పూర్తయ్యేసరికి సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులంటున్నారు. గతంలో ఎంఎన్‌జే క్యాన్సర్‌‌ ఆస్పత్రి బృందాలూ కొన్ని ప్రాంతాల్లో స్ర్కీనింగ్ చేసి రోగం విస్తరిస్తున్నట్టు గుర్తించాయి. సెక్సువల్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫెక్షన్‌‌‌‌తో సోకే హ్యూమన్‌‌‌‌ పాపిలోమా వైరస్‌‌‌‌ (హెచ్‌‌‌‌పీవీ) సర్వికల్ క్యాన్సర్‌‌కు దారి తీస్తుంది. 99 శాతం లైంగిక కలయికతోనే వైరస్‌ విస్తరిస్తుంది. టీకాలతో దీన్ని కంట్రోల్‌ చేయొచ్చు. అందుకే బాలికలకు వ్యాక్సిన్‌ ఇచ్చి ఆ రోగాన్ని ఎదుర్కోవాలని భావిస్తున్నారు.