డాక్టర్ల నియామకాల్లో.. వెయిటింగ్ లిస్ట్ విధానాన్ని తీసుకురావాలి : హెచ్ఆర్డీఏ

డాక్టర్ల నియామకాల్లో.. వెయిటింగ్ లిస్ట్ విధానాన్ని తీసుకురావాలి : హెచ్ఆర్డీఏ
  •     హెల్త్ మినిస్టర్ దామోదరకు హెచ్ఆర్డీఏ విజ్ఞప్తి
  •     డీఎంఈ, టీవీవీపీ నోటిఫికేషన్లలోని 2,200 పోస్టుల భర్తీపై వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొనసాగుతున్న డాక్టర్ల నియామకాల్లో కేటగిరీ వారీగా వెయిటింగ్ లిస్ట్ విధానాన్ని తీసుకురావాలని హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) ప్రభుత్వాన్ని కోరింది. అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్లు కార్తీక్ నాగుల, రాకేశ్, ప్రఫుల్, సుప్రియ, అసిమ్, ఆదిత్య తదితరులు శనివారం మంత్రి దామోదర రాజనర్సింహను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా హెచ్ఆర్డీఏ ప్రతినిధులు మాట్లాడుతూ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ (డీఎంఈ) పోస్టులు, 1,623 సీఏస్ స్పెషలిస్ట్ (టీవీవీపీ) పోస్టుల నియామకంలో వెయిటింగ్ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానాన్ని సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపికైన అభ్యర్థులు కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు రాకపోయినా, జాయిన్ అవ్వకపోయినా ఆ ఖాళీలు అలాగే ఉండిపోతున్నాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అందుబాటులో ఉన్నప్పటికీ పోస్టులు భర్తీ కావడం లేదని మంత్రికి వివరించారు. 

ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో నెం.81 ప్రకారం వెయిటింగ్ లిస్ట్ లేకపోవడంతో ఒకరు ఉద్యోగంలో చేరని పక్షంలో ఆ పోస్టును తర్వాతి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్స్ లో డాక్టర్ల కొరత వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు, కేంద్ర సంస్థల తరహాలోనే వెయిటింగ్ లిస్ట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. దీనివల్ల హాస్పిటల్స్ కు వెంటనే సిబ్బంది అందుబాటులోకి వచ్చి ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని, నిరుద్యోగ డాక్టర్లకు న్యాయం జరుగుతుందని వివరించారు. ఈ ప్రతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.