
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం ‘వార్ 2’.ఆగస్టు 14 సినిమా విడుదల కానుంది. తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ఇది యాక్షన్ సినిమానే కాదు.. దానికి మించిన సర్‌ప్రైజ్ ఈ చిత్రంలో ఉంది. ఈ ఏడాదిని హృతిక్ రామ నామ సంవత్సరంగా ప్రకటిద్దాం ’అని అన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘నా కెరీర్ ఇరవై ఐదు వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఇలా అభిమానుల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చేయడానికి ప్రధానం కారణమైన ఆదిత్య చోప్రా గారికి థ్యాంక్స్. అయాన్ ముఖర్జీ ఒక్కడే ఈ సినిమాను తీయగలడు. హృతిక్ రోషన్ ఇండియాలోనే ఫైనెస్ట్ యాక్టర్, గ్రేటెస్ట్ డ్యాన్సర్. అలాంటి వ్యక్తితో నటించడం వెరీ హ్యాపీ. సెట్‌లో ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా’అని చెప్పాడు.
హృతిక్ మాట్లాడుతూ ‘తారక్ నాకు తమ్ముడు లాంటివాడు. తనతో స్ర్కీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ. తారక్ దగ్గర సింగిల్ టేక్‌లో ఎలా చేయాలో నేర్చుకున్నా. తనలో నన్ను నేను చూసుకున్నా. తొలి షాట్ లోనే అతడు తన 100 పర్సెంట్ ఇచ్చేస్తాడు. 99.99 కూడా కాదు. మొత్తం 100 శాతం ఇస్తాడు. తర్వాత ఆ షాట్ కూడా చూడడు. ఎందుకంటే తాను పూర్తిగా ఇచ్చేశానని తనకు తెలుసు. అది ఎన్టీఆర్ నుంచి నేను నేర్చుకున్నాను’అని అన్నాడు.
అయాన్ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్, హృతిక్ లాంటి స్టార్స్ తో వర్క్ చేయడం మొమరబుల్ ఎక్స్ పీరియెన్స్. ఇందులో గొప్ప కథ ఉంది. అది అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది’అని చెప్పాడు.
నాగవంశీ మాట్లాడుతూ ‘తారక్ అన్న హిందీకి వెళ్లినట్టు కాదు.. హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీకి వెల్‌కమ్ చెప్పినట్టుగా భావిస్తున్నా. ఆడియెన్స్ ‘దేవర’పై చూపిన ప్రేమను పదింతలు చూపించాలి. తారక్ అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే హిందీ బాక్సాఫీస్‌ను మించేలా ఈ సినిమా కలెక్షన్స్ ఉండాలని కోరుకుంటున్నా’అని అన్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సీఈవో అక్షయ్ విధాని, నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు.