
హైదరాబాద్లో భారీ మొత్తంలో హవాలా సొమ్ము పట్టుబడింది. అబిడ్స్ ట్రూప్ బజార్ లో లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.63,50,000 డబ్బు చేతులు మారుతున్న విషయం తెలుసుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. నగదును సీజ్ చేసి ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితులను అఫ్జల్ గంజ్ పోలీసులకు అప్పగించారు.
మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిథిలో హవాలా సొమ్ము పట్టుబడింది. సోమాజీగూడ పార్క్ హయత్ రోడ్డులో వెళ్తున్న కారులో రూ.20లక్షల దొరికాయి. వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు సోదాలు నిర్వహించగా ఈ నగదు పట్టుబడింది. డబ్బు తీసుకెళ్తున్న కర్మాన్ ఘాట్ కు చెందిన వెంకటేశ్వర్లు, మహేశ్వర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జితేందర్ కుమార్ అనే వ్యక్తి వెంకటేశ్వర్లు ద్వారా రూ.20 లక్షలు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు.