హైదరాబాద్ మినహా అన్ని సెంటర్లు క్లోజ్

హైదరాబాద్ మినహా అన్ని సెంటర్లు క్లోజ్
  • ఆన్​లైన్​ ఎగ్జామ్ కావడంతో ముందు అప్లై చేస్తే ముందు సెంటర్ అలాట్ 
  • ఈ నెల 6 వరకు దరఖాస్తుకు అవకాశం 
  • హైదరాబాద్​లో నిండితే.. ఏపీలో రాయాల్సిన పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీఎస్ ఎప్ సెట్ కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ఆన్​లైన్ ఎగ్జామ్ సెంటర్లన్నీ వేగంగా నిండిపోతున్నాయి. హైదరాబాద్​లోని కొన్ని ప్రాంతాల సెంటర్లు మినహా మిగిలిన జిల్లాల్లో సెంటర్లన్నీ బ్లాక్ అయ్యాయి. దీంతో ఆలస్యంగా అప్లై చేసుకునే అభ్యర్థులకు కోరుకున్న చోట కాకుండా, మరోచోట పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  లోక్​సభ ఎన్నికలున్నందున ఇటీవలే ఎప్ సెట్ఎగ్జామ్ తేదీలను మారుస్తూ.. మే 7 నుంచి 11 వరకూ నిర్వహిస్తామని సర్కారు ప్రకటించింది. ఇప్పటి వరకు 3 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈ నెల 6 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకునే చాన్స్ ఉంది. ఎగ్జామ్ నిర్వహణ ఆన్​ లైన్ పరీక్షా కేంద్రాల్లో ఉండటంతో అందరికీ ఒకే సారి పరీక్ష నిర్వహించే అవకాశాలు లేవు. దీంతో ఇంజినీరింగ్ కాలేజీలు, ఇతర సెంటర్లను పరీక్షా కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు. ఎప్​సెట్ పరీక్షా కేంద్రాల  సమన్వయం కోసం 21 జోన్లుగా ఏర్పాటు చేయగా, వీటిలో తెలంగాణలో 16 జోన్లు, ఏపీలో ఐదు జోన్లున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ను నాలుగు భాగాలుగా చేశారు. ఇంజినీరింగ్ స్ర్టీమ్ స్టూడెంట్లకు తెలంగాణలో ఏర్పాటు చేసిన 16 జోన్లలో  మూడు జోన్లలో, ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ స్టూడెంట్లు 5 జోన్లలో మాత్రమే ప్రస్తుతం పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. మిగిలిన జోన్లన్నీ నిండిపోయాయి. 

వచ్చినోళ్లకు వచ్చినట్టు సెంటర్ల అలాట్..

అభ్యర్థులు లక్షల్లో ఉండటం.. ఆన్​ లైన్ పరీక్ష కేంద్రాలు తక్కువగా ఉండటంతో ఎప్​ సెట్ నిర్వహణ కష్టంగా మారింది. ఇంజినీరింగ్ స్ర్టీమ్​లో హైదరాబాద్ నాలుగో జోన్​ పరిధిలోని కూకట్ పల్లి, బాచుపల్లి, గండిపేట, మెయినాబాద్, హిమాయత్ సాగర్ తదితర ఏరియాల్లోని పరీక్షా కేంద్రాలు ఇప్పటికే నిండిపోయాయి. నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహూబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట తదితర సెంటర్లలో కంప్యూటర్లకు సరిపడా అభ్యర్థులను అలాట్ చేసి, వాటిని బ్లాక్ చేశారు. ప్రస్తుతం ఆయా ఏరియాల్లోని అభ్యర్థులు ఇప్పటికీ అప్లై చేయకపోతే.. ప్రస్తుతం హైదరబాద్ 1,2,3 జోన్ల పరిధిలోని సెంటర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న సెంటర్లకు అనుగుణంగా ఏపీ, తెలంగాణలో ఇంజినీరింగ్​లో  13వేల మంది, ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్​లో 39వేల మందికి సీట్లను అలాట్ చేసేందుకు అవకాశం ఉంది. విద్యార్థులు సాధ్యమైనంత త్వరగా అప్లై చేసుకోవాలని, తద్వారా తమకు ఇంకా ఎన్ని సెంటర్లు కావాలనే దానిపై క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తున్నారు. 

సిటీలో మరిన్ని సెంటర్లు పెంచుతున్నం

ఇంజినీరింగ్​ స్ట్రీమ్​లో రాష్ట్రంలో ఇప్పటికే సిటీలో మూడు జోన్లు మినహా అన్ని సెంటర్లు నిండాయి. జిల్లాల్లో ఎక్కువగా ఇంజినీరింగ్ కాలేజీలు లేకపోవడంతో, అక్కడ సెంటర్లు ఎక్కువగా పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఏపీలో ఇంకా చాలామంది రాసేందుకు అవకాశం ఉంది. మిగిలిన స్టూడెంట్లందరినీ హైదరాబాద్​లో రాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతిరోజూ సెంటర్ల సంఖ్య, అభ్యర్థుల అలాట్మెంట్లను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం.
– విజయకుమార్, ఎప్​సెట్ కోకన్వీనర్