వరంగల్ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు

వరంగల్ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు

వరంగల్లో జరిగే బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు తెస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దాశరథి, కాళోజీ లాంటి మేధావులు పుట్టిన గడ్డపై రైతు సమస్యల పరిష్కారం కోసం రాహుల్ గాంధీ సభ జరగడం సంతోషంగా ఉందని చెప్పారు. పక్క రాష్ట్రంలో కౌలు రైతులకు కూడా ప్రభుత్వాలు భరోసా ఇస్తుండగా.. మన సర్కారు మాత్రం లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఇంత వరకు చేయలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. వరి వేస్తే ఉరేనన్న కేసీఆర్ కారణంగా 20లక్షల ఎకరాల్లో రైతులు వరిపంట వేయకుండా పొలాన్ని పడావు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ మాటలు నమ్మి పంట వేయని రైతన్నలకు ఎకరాకు రూ.20వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేస్తుందో వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పబోతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. డిక్లరేషన్ లోని అంశాలను ఎన్నికల వరకు ఊరూరా ప్రచారం చేస్తామని చెప్పారు. నిరుద్యోగం, మహిళలు, బడుగు బలహీన వర్గాల సమస్యల మీద పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇకపై నెలకొక బహిరంగ సభ పెడతామన్న ఆయన.. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ అందకపోవడంపైనా ప్రభుత్వాన్ని నిలదీస్తామని వెల్లడించారు. మిల్లర్లు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. 

For more news..

కేసీఆర్ మాటల సుడిగుండంలో రైతు విలవిల

సూర్యాపేట మార్కెట్ యార్డులో షర్మిల ధర్నా