
- సమర భేరి సభ సక్సెస్
- అమిత్ షా సభకు భారీగా తరలివచ్చిన జనం
- టీఆర్‌ఎస్ సభ కంటే ఎక్కువ వచ్చినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్
నల్గొండ/హైదరాబాద్, వెలుగు: బీజేపీ సమర భేరి సభ విజయవంతమైంది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం నల్గొండ జిల్లా మునుగోడులో జరిగిన బహిరంగ సభకు నియోజవర్గ వ్యాప్తంగా భారీగా జనం తరలి వచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక సందర్భంగా నిర్వహించిన సభకు అమిత్ షా, జాతీయ, రాష్ట్ర నేతలు హాజరయ్యారు. 34 ఎకరాలు జనంతో నిండిపోయింది.
జనం రాకపైన ఆరా..
మధ్యాహ్నం 2 గంటల నుంచే జనాలు సభా ప్రాంగణానికి రావడం మొదలు పెట్టారు. సభకు వస్తున్న జనం ఎక్కడి నుంచి వస్తున్నారు? నియోజకవర్గానికి చెందిన వారేనా? మరెక్కడి నుంచైనా వస్తున్నారా? అనే కోణంలో పోలీసులు, నిఘా టీమ్‌లు ఆరా తీశా యి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజశ్వేరరెడ్డితో పాటు పలువురు నేతలు అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేసి సభ గురించి తెలుసుకున్నారు. కేసీఆర్ సభకు 40వేల నుంచి 50వేల మంది వస్తే.. బీజేపీ సభకు లక్షన్నర మంది వచ్చారు.
సభ సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు: బండి సంజయ్
మునుగోడులో బీజేపీ సమరభేరి బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభ పార్టీ కార్యకర్తల్లో ఎంతో ఉత్తేజాన్ని నింపిందని వివరించారు.