యాదాద్రి దర్శనాలు షురూ.. మస్తు రద్దీ

యాదాద్రి దర్శనాలు షురూ.. మస్తు రద్దీ

యాదాద్రిలో స్వయంభూ దర్శనాలు మొదలయ్యాయి. ఉదయం ఆలయ మహాకుంభసంప్రోక్షణలో సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొన్నారు. ఇక నిర్మాణంలో భాగస్వాములైన వారిని సన్మానించారు. ముహూర్తం ప్రకారమే మహాకుంభ సంప్రోక్షణ పూర్తయ్యింది. ఆలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం వేదమంత్రోచ్చారణల మధ్య కన్నుల పండువగా నిర్వహించారు. ఏకాదశి శ్రవణ నక్షత్రయుక్త మిథున లగ్నంలో.. పుష్కరాంశ శుభ ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ జరిగింది. ఈ సందర్బంగా మూడుసార్లు స్వామివారి శోభాయాత్ర నిర్వహించారు. ఇక చాలాకాలం తర్వాత స్వయంభూ దర్శనాలకు అనుమతించడంతో.. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం నుంచి ఆలయంలో రద్దీ భారీగా కనిపించింది. స్వామివారి దర్శనంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం చాలా బాగుందని అంటున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కొంత మంది భక్తులు మాత్రం వసతులు సరిగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు.

తొలి పూజ చేసిన సీఎం కేసీఆర్

యాదాద్రి లక్ష్మీ నర్సింహుడికి సీఎం కేసీఆర్ దంపతులు.... తొలి పూజ చేశారు. ప్రధానాలయం చుట్టూ నిర్వహించే స్వామివారి శోభయాత్రలో పాల్గొన్నారు. తర్వాత ప్రధానాలయ విమాన గోపురం దగ్గర మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్నారాయన. గంటకుపైగా గోపురంపైన పూజల్లో పాల్గొన్నారు. 126 మెట్లు ఎక్కి గోపురంపైకి వెళ్లిన సీఎం.. మళ్లీ అదే మార్గంలో కిందకు వచ్చారు.

3 గంటల నుంచి దర్శనాలు షురూ

ఆలయం పున:ప్రారంభం కావడంతో సాయంత్రం 3 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. దర్శనాలపై ముందే ప్రకటన చేయడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయం అద్భుతంగా ఉందన్నారు. భక్తులు భారీగా రావడంతో దర్శనాలు ఆలస్యమయ్యాయి. దీంతో తమకు సరైన సౌకర్యాలు కల్పించలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.