మెడికల్ కంటే.. ఇంజినీరింగ్ ఫీజులే ఎక్కువ

మెడికల్ కంటే..  ఇంజినీరింగ్ ఫీజులే ఎక్కువ
  • సర్కారు ఇంజినీరింగ్ కాలేజీల్లో భారీగా వసూళ్లు
  • ఎంబీబీఎస్ ఫస్టియర్ ట్యూషన్ ఫీజు రూ.10 వేలు.. బీటెక్ ఫీజు రూ.50 వేలు  
  • సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో ఓయూలో బీటెక్​ ఫీజు రూ.1.20 లక్షలు, జేఎన్టీయూలో లక్ష

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీబీఎస్ ఫీజు కంటే బీటెక్ ఫీజులే ఎక్కువున్నాయి. సర్కారు ఇంజినీరింగ్ కాలేజీల్లోనే ఈ ఫీజుల దందా నడుస్తుండడం గమనార్హం. సర్కారు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లకు నామమాత్రంగా ఫీజులు తీసుకుంటుండగా, ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లో మాత్రం దానికి పదింతల ఫీజులను స్టూడెంట్ల నుంచి గుంజుతున్నారు.ప్రైవేటు కాలేజీలతో పోటీపడి మరీ పేరెంట్స్ నుంచి ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీని సర్కారు పట్టించుకోవడం లేదు.

రెండేండ్లలో రూ.32 వేలు పెంపు

రాష్ట్రంలో 16 సర్కారు ఇంజినీరింగ్ కాలేజీలుండగా, వాటిలో 4,713 సీట్లున్నాయి. వీటిలో ప్రధానంగా జేఎన్టీయూ పరిధిలో ఆరు కాలేజీలుండగా వాటిలో 2,580 సీట్లు, కేయూ పరిధిలో మూడు కాలేజీల్లో 1,080, ఓయూ పరిధిలో రెండు కాలేజీల్లో 630 సీట్లున్నాయి. అగ్రికల్చర్ వర్సిటీ పరిధిలో రెండు, ఎంజీయూ, జేఎన్ఏఎఫ్​ఏయూ, వెటర్నరీ వర్సిటీ పరిధిలో ఒక్కో కాలేజీలో ఇంజినీరింగ్ కోర్సులున్నాయి. జేఎన్టీయూ, ఓయూ పరిధిలోని సర్కారు కాలేజీల్లో మినిమమ్ ఫీజు రూ.50 వేలు ఉంది. మూడేండ్ల కింద ఫీజు రూ.18వేలు ఉండగా, రెండేండ్ల కింద దాన్ని రూ.35వేలకు పెంచారు. గతేడాది ఏకంగా రూ.50వేలు చేశారు. వరుసగా రెండేండ్లు ఫీజులు పెంచినా సర్కారు కనీసం స్పందించలేదు.

సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో వసూళ్లు

ప్రభుత్వం పోస్టులు నింపకపోవడంతో కాలేజీలు సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. ఆయా కోర్సుల నుంచి వచ్చే ఫీజులతో టీచింగ్ సిబ్బందికి జీతాలు చెల్లిస్తారు. సర్కారు నిధులు ఇవ్వడం లేదనే పేరుతో యూనివర్సిటీలన్నీ ఇదే దారిని ఎంచుకున్నాయి. ప్రస్తుతం మొత్తం సర్కారు ఇంజినీరింగ్ కాలేజీల్లో 4,713 సీట్లు ఉండగా, వాటిలో 1,975 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లోనివే. ఇటీవల రెండు, మూడేండ్ల నుంచి వర్సిటీలు కొత్త కోర్సులు పెడుతున్నాయి. ప్రస్తుతం కేయూ పరిధిలో మొత్తం 1,080 సీట్లుంటే దాంట్లో 700 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులవే. జేఎన్టీయూ పరిధిలో 540, ఎంజీయూ పరిధిలో 240, ఓయూ పరిధిలో 180, ఫైనార్ట్స్ వర్సిటీ పరిధిలో 160 సీట్లు దీని పరిధిలోనే ఉన్నాయి. 

ప్రస్తుతం సెల్ఫ్ ఫైనాన్స్ లో ఇంజినీరింగ్ ఫీజులు భారీగా వసూలు చేస్తున్నాయి. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ కోర్సుకు ఏకంగా ఏడాదికి రూ.1.20లక్షల ఫీజును తీసుకుంటుంది. మైనింగ్ ఇంజినీరింగ్​కు రూ.లక్ష వసూలు చేస్తోంది. జేఎన్టీయూ మొత్తం రూ.లక్ష ఫీజు నిర్ణయించుకున్నది. ఐదేండ్ల ఎంటెక్ కోర్సును తీసుకురాగా, దాంట్లోని అన్ని కోర్సులూ సెల్ఫ్ ఫైనాన్స్ పరిధిలోనే ఉన్నాయి. ఒక్కో సీటు ఫీజు రూ.లక్ష వసూలు చేస్తున్నారు. అయితే ఫీజుల పెంపుపై వర్సిటీ అధికారులను స్టూడెంట్లు ప్రశ్నిస్తే, సరైన సమాధానం మాత్రం ఇవ్వడం లేదు. అయితే ఫీజు రీయింబర్స్ మెంట్​ కింద కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే పూర్తిస్థాయి ఫీజును ప్రభుత్వం ఇస్తుంది.

కొత్త కాలేజీలపై సప్పుడు లేదు

రాష్ట్రంలో ఈ ఏడాది మూడు కొత్త కాలేజీలు వస్తాయనే ప్రచారం జరిగింది. మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో కాలేజీల ఏర్పాటుకు కసరత్తు కూడా జరిగింది. గతేడాది సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల పర్యటన నేపథ్యంలో మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో కొత్త ఇంజినీరింగ్ కాలేజీలు ప్రారంభిస్తారనీ ప్రకటించారు. కానీ, మూడూ కాలేజీలకు సర్కారు నుంచి పర్మిషన్ రాలేదు. దీంతో స్టూడెంట్లలో నిరాశ మిగిలింది. మరోపక్క రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లోని పాలిటెక్నిక్ కాలేజీనూ ఇంజినీరింగ్ కాలేజీలు మార్చాలనే ప్రతిపాదన కూడా గతంలో వచ్చింది. అది కూడా మధ్యలోనే ఆగిపోయింది.

ఎంబీబీఎస్​  మొత్తం ఫీజు రూ.29 వేలే

రాష్ట్రంలో 26 సర్కారు మెడికల్ కాలేజీలుండగా, వాటిలో  3,700 వరకూ సీట్లున్నాయి. ప్రస్తుతం ఆయా కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్టియర్​లో ట్యూషన్ ఫీజు రూ.10వేలు మాత్రమే ఉంది. లైబ్రరీ ఫీజు, కాషన్ డిపాజిట్, సీడీఎస్​ తదితర అన్ని రకాల ఫీజులు కలిపి ఎస్సీ, ఎస్టీలకు 27వేలు, ఓసీ, బీసీలకు 29వేలు తీసుకుంటున్నారు. అయితే దీంట్లోనూ స్కాలర్ షిప్ అర్హులుగా ఉన్న స్టూడెంట్లకు ఆ మొత్తం తిరిగి వస్తుంది. మరోపక్క వచ్చే ఏడాది కొత్తగా మరిన్ని మెడికల్ కాలేజీలు వచ్చే అవకాశముంది. ఈ లెక్కన సర్కారు ఇంజినీరింగ్ కాలేజీల కంటే, మెడికల్ కాలేజీలే రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి.