ముంచెత్తింది: జోరువాన.. భైంసా, బాసర జలదిగ్బంధం

ముంచెత్తింది: జోరువాన.. భైంసా, బాసర జలదిగ్బంధం
  • చాలా పల్లెలకు రాకపోకలు బంద్​.. జనజీవనం అతలాకుతలం
  • నిర్మల్​ జిల్లా ముధోల్‌‌లో 20.3 సెం.మీ.ల వర్షపాతం
  • మేడిగడ్డ, తుపాకులగూడెం వద్ద ఉగ్ర గోదావరి
  • హైదరాబాద్​లోనూ రోజంతా భారీ వర్షం
  • 8 జిల్లాలకు రెడ్‌‌ అలర్ట్‌‌ ప్రకటించిన అధికారులు
  • ఎస్సారెస్పీకి భారీ వరద.. ఎల్లంపల్లి 20 గేట్లు ఓపెన్‌‌


రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)కు వరద పోటెతుతున్నది. ప్రాజెక్టులోకి 1.71 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తున్నది. కడెం ప్రాజెక్టుతో పాటు ఎల్లంపల్లిని వరద ముంచెత్తింది. కడెం గేట్లు ఎత్తి 70 వేల క్యూసెక్కులకు పైగా నీటిని నదిలోకి వదిలేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694.975 అడుగుల నీటి మట్టం ఉంది. ఎల్లంపల్లికి భారీ వరద రావడంతో శనివారం సాయంత్రం ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కులకు పైగా నీటిని నదిలోకి వదిలేస్తున్నారు. మేడిగడ్డ, తుపాకులగూడెం (సమ్మక్కసాగర్‌‌)  వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆదివారం ఉదయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగనుంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద వస్తున్నది. 

నెట్​వర్క్/హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో వానలు ముంచెత్తుతున్నాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తుండడంతో జనజీవనం అతలాకుతలమవుతున్నది. కొన్ని జిల్లాల్లో మధ్యాహ్నం కాసేపు తెరిపి ఇచ్చినప్పటికీ మళ్లీ జోరందుకుంది. ఉమ్మడి నిజామాబాద్‌‌, ఉమ్మడి ఆదిలాబాద్‌‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. భైంసాలోని అనేక కాలనీలు, బాసరలో కొన్ని కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇండ్లల్లోకి నీళ్లు వచ్చి చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహారాష్ట్రలో  విష్ణుపురి తదితర ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో గోదావరిలోకి వరద పోటెత్తుతున్నది. దీంతో శ్రీరాంసాగర్​లోకి ఇన్​ఫ్లో గంటగంటకు పెరుగుతున్నది. చాలా చోట్ల గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పలు జిలాల్లోని  కలెక్టరేట్లలో కంట్రోల్​ రూమ్​లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నారు. వేలాది ఎకరాల్లోని సోయా, పత్తి పొలాల్లో వాననీరు నిలిచిపోయింది.


నిర్మల్​ జిల్లా భైంసా పట్టణం నీట మునిగింది. ఇక్కడి గడ్డెన్న ప్రాజెక్టులోకి ఇన్​ఫ్లో భారీగా వస్తుండటంతో శనివారం  నాలుగు గేట్లు ఎత్తి నీళ్లను కిందికి వదిలారు. గడ్డెన్న ప్రాజెక్ట్​ నీరు, ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తిన వరదతో భైంసా పట్టణంలోని ఆటోనగర్​, వివేకానంద చౌరస్తా, వినాయక్​ నగర్​, రాహుల్​ నగర్​, ఫిష్​ మార్కెట్​, కుభీర్​ చౌరస్తా తదితర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఎన్​ఆర్​ గార్డెన్​లో పని చేసే ఆరుగురు సిబ్బంది వరదలో చిక్కుకున్నారు.  గ్రౌండ్​ ఫ్లోర్ ​మొత్తం మునిగిపోవడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం మీదికి ఎక్కారు. దాదాపు పది గంటల పాటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూశారు. బాసర నుంచి గజ ఈతగాళ్లను రప్పించి తెప్పల మీద వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇండ్ల నుంచి అడుగు బయట పెట్టలేకపోయారు. గాంధీ గంజ్​-బస్టాండ్​, పురాణ బజార్​-ప్రాజెక్టు, గణేష్​ నగర్​-ప్రాజెక్టు, బైపాస్​ రోడ్డు, వివేకానంద చౌరస్తా- ఆటో నగర్​ తదితర మెయిన్​ రోడ్లు వరద నీటిలో మునిగిపోయాయి. రోడ్ల మీద మోకాలి లోతు వరకు నీళ్లు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శివారు ప్రాంతాల్లో సరైన డ్రైనేజీలు లేక వర్షపు నీరంతా ఇండ్లలోకి చేరింది. శనివారం భైంసా డివిజన్​లో 16 సెంటీమీటర్ల  వర్షపాతం రికార్డయింది. జిల్లా కలెక్టర్​ ముషారఫ్​ ఆలీ ఫారూఖీ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పల్సికర్​ రంగారావు ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​తో గుండెగాం మరోసారి మునిగిపోయింది. శనివారం తెల్లవారుజామున భైంసా, -మహాగాం (బి) వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం 11 గంటలకు వరద గ్రామాన్ని ముంచెత్తింది. ఇండ్లలోని సరుకులు నీళ్ల పాలయ్యాయి. పత్తి, సోయా ఇతర పంటలన్నీ మునిగాయి. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో కొన్ని కుటుంబాలను  అధికారులు తాత్కాలికంగా భైంసాలోని డబుల్​ బెడ్​రూం ఇండ్లలోకి తరలించారు.  బాసరలోని పలు ప్రాంతాలు కూడా నీట మునిగాయి. రవీంద్రాపూర్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. సహాయ సిబ్బంది నాటు పడవల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. భైంసా– బాసర రహదారిపై బిద్రెల్లి గ్రామం వద్ద బ్రిడ్జి పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బైంసా– నిజామాబాద్ రాకపోకలు నిలిచిపోయాయి. ఓని గ్రామం వద్ద బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  
 

నిలిచిన బొగ్గు ఉత్పత్తి 
సింగరేణి అంతటా వర్షాలు కురవడంతో ఓపెన్​కాస్ట్​ గనులు బురదగా మారాయి. భారీ యంత్రాలు నడవడంలేదు. 19 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లాల పరిధిలోని మందమర్రి, శ్రీరాంపూర్​, బెల్లంపల్లి ఏరియాల్లో గల ఆర్కేపీ ఓసీపీ, కేకే ఓసీపీ, ఎస్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీ, ఖైరీగూడ ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శనివారం నాటికి ఐదు ఓసీపీల్లో సుమారు 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం  కలిగింది. ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లోని ఓపెన్​కాస్ట్​ గనుల్లో 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్​ పడింది. సింగరేణి రామగుండం రీజియన్‌‌‌‌ పరిధిలోని ఓసీపీ 1, 2, 3, 5లో రోజుకు 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు రవాణాకు బ్రేక్‌‌‌‌ పడింది. 


ముధోల్​లో 20.3 సెంటీమీటర్లు..
శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్మల్‌‌లో జిల్లా ముధోల్‌‌లో అధికంగా 20.3 సెం.మీ.ల వర్షం కురిసింది. శనివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్‌‌ జిల్లా భైంసాలో 16.8 సెం.మీ, నిజామాబాద్‌‌ జిల్లా మాచెర్లలో 16.1, మాగిడిలో 15.6, జక్రాన్‌‌పల్లి, మాదన్నపల్లెలో 15.5 సెం.మీ.ల చొప్పున, ఆలూరులో 15.2, బసరలో 14.9, రేంజల్‌‌లో 14.4, నిర్మల్‌‌ జిల్లా తానూరులో 13.8, నిజామాబాద్‌‌ జిల్లా తొండాకూర్‌‌లో 13.2, నిర్మల్‌‌ జిల్లా లోకేశ్వరంలో 12.8, నిజామాబాద్‌‌ జిల్లా చిన్న మావండిలో 12.5, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 12.3, నిజామాబాద్‌‌ జిల్లా నవీపేట్‌‌లో 12, కామారెడ్డి జిల్లా సర్వాపూర్‌‌లో 11.7, నిజామాబాద్‌‌ జిల్లా లక్ష్మాపూర్‌‌లో 11.6, ముప్కాల్‌‌లో 11.5 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.

8 జిల్లాలకు రెడ్​ అలర్ట్​
రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలకు హైదరాబాద్​ వాతావరణ కేంద్రం రెడ్​ అలర్ట్​ ప్రకటించింది. ఇందులో ఆదిలాబాద్‌‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌, మంచిర్యాల, నిర్మల్‌‌, నిజామాబాద్‌‌, పెద్దపల్లి, జయశంకర్‌‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు  అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌‌, వరంగల్‌‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మెదక్‌‌, కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్​లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆది, సోమవారాల్లోనూ ఆదిలాబాద్‌‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌, మంచిర్యాల, నిర్మల్‌‌, నిజామాబాద్‌‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. 


ప్రాజెక్టులకు వస్తున్న వరద.. 
నీటి నిల్వలు (శనివారం రాత్రి 9 గంటల వరకు)
ప్రాజెక్టు    పూర్తి కెపాసిటీ    ప్రస్తుత నిల్వ    ఇన్‌‌‌‌ఫ్లో    ఔట్‌‌‌‌ ఫ్లో         (టీఎంసీల్లో)    (టీఎంసీల్లో)    (క్యూసెక్కుల్లో)    (క్యూసెక్కుల్లో)
కృష్ణా బేసిన్‌‌‌‌
ఆల్మట్టి    129.72    75.20    90,397        451
తుంగభద్ర    100.86    74.95    95,484    308
జూరాల    9.66    7.10    1,725    1,088
శ్రీశైలం    215.81    43.89    793    0
నాగార్జునసాగర్‌‌‌‌    312.05    165.43    0    3,428
గోదావరి బేసిన్‌‌‌‌
శ్రీరాంసాగర్‌‌‌‌    90.31    39.30    1,71,000    100
కడెం    7.60    6.08    58,739    69,639
ఎల్లంపల్లి    20.18    12.58    59,815    59,815
మేడిగడ్డ    16.17    4.81    4,04,470    4,36,100
సమ్మక్క సాగర్‌‌‌‌    6.94    2.44    5,15,000    5,15,000
సీతమ్మ సాగర్‌‌‌‌    36.57    0.2    2,03,122    2,03,122