అభివృద్ధి పనుల్లో భారీగా నిధులు దుర్వినియోగమైనయ్​: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అభివృద్ధి పనుల్లో భారీగా నిధులు దుర్వినియోగమైనయ్​: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • ఇష్టారాజ్యంగా పనులు చేసి.. స్థానికులను ఆగంపట్టించిన్రు!
  • ఫిబ్రవరి 3న ఎండోమెంట్ మినిస్టర్ రివ్యూ ఉంటది
  • ఆర్అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

యాదగిరిగుట్ట/యాదాద్రి, వెలుగు:  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఇప్పటికే జరిగిన పనులు, ఇకపై చేపట్టాల్సిన పనులపై ఆఫీసర్లతో సమీక్ష జరిపారు. రివ్యూ తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానికుల అభిప్రాయాలు తీసుకోకుండా ఇష్టానుసారంగా చేసిన అభివృద్ధి పనుల కారణంగా యాదగిరిగుట్ట ఆగమైందన్నారు. అవసరం లేకున్నా వైకుంఠ ద్వారం వద్ద నిర్మించిన బ్రిడ్జి కారణంగా యాదగిరిగుట్ట పట్టణం రెండుగా విడిపోయి స్థానికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఓ రిటైర్డ్ ఉద్యోగిని యాదగిరిగుట్ట ఈవోగా పెట్టడంతో నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. చేసిన పనులకు సంబంధించి దాదాపుగా రూ.300 కోట్ల బిల్లులను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్​లో పెట్టిందన్నారు. కొండపైన డార్మెటరీ హాల్ నిర్మించకపోవడంతో..భక్తులు నిద్ర చేయడానికి వీలు లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పేరుతో యాదగిరిగుట్టలో ఆటో డ్రైవర్లతో మొదలుపెట్టి సాధారణ చిరు వ్యాపారం చేసుకునే స్థానికుల కడుపుకొట్టి ఉపాధి లేకుండా చేసిందన్నారు. యాదగిరిగుట్టలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులు, చేర్పులు, మార్పులపై ఫిబ్రవరి 3న ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ ఆధ్వర్యంలో రివ్యూ నిర్వహించనున్నామని తెలిపారు. కొండపైకి ఆటోల అనుమతి, వైకుంఠ ద్వారం వద్ద బ్రిడ్జి తొలగింపు, భక్తుల సౌకర్యం కోసం చేపట్టాల్సిన పనులపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ స్థాయిలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గుట్టలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో అందుకనుగుణంగా కొత్తగా మరో 40 బస్సులను అందుబాటులోకి తేబోతున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి మర్చిపోయిన గంధమల్ల రిజర్వాయర్ ను తొందరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతుందని క్లారిటీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, యాదాద్రి కలెక్టర్ హనుమంతు జెండగే, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, సర్పంచులు కవిత వెంకటేష్ గౌడ్, భీమగాని రాములు గౌడ్, గుట్ట మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, జిల్లా నాయకులు దుంబాల వెంకట్ రెడ్డి ఉన్నారు.

కారును స్క్రాప్​కింద అమ్ముకున్నరు..

‘కారు షెడ్డుకు పోలె, సర్వీసింగ్ కు పోయింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నడు. కారు షెడ్డుకు పోలె.. సర్వీసింగ్ కు పోలె..స్క్రాప్ కింద కారును దొంగలు అమ్ముకున్నరు. కారు లేదు..పార్టీ లేదు, అసలు బీఆర్ఎస్ అనే పార్టే లేదు’ అని ఆర్అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాకముందే ఇష్టానుసారంగా విమర్శిస్తున్న బీఆర్ఎస్ నాయకులు.. వచ్చే ఆరు నెలల్లో తీహార్ జైలులో ఉంటారన్నారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో రూ.6.31 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలిసి బుధవారం ప్రారంభించారు. అలాగే మైలారంలో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆరునూరైనా వంద రోజుల్లోపు ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. హాజీపూర్ బ్రిడ్జిని ఆరు నెలల్లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే, రూ.40 లక్షల ప్రత్యేక నిధులతో హాజీపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అఘాయిత్యాలకు బలైపోయిన బాలికల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధిత ఫ్యామిలీలకు ఇండ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాల్లో అర్హులైన వారికి ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగాలు ఇస్తామన్నారు