
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కిందటి నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.26,866 కోట్లు వచ్చాయి. గత 23 నెలల్లో ఇదే హయ్యెస్ట్. కంపెనీలు కొత్త ఫండ్స్‌ను తీసుకొస్తుండడంతో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోంది. ఈ ఏడాది జనవరిలో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన రూ.21,780 కోట్లతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ.
మరోవైపు ఇన్వెస్టర్లు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కిందటి నెలలో సిప్ రూట్‌లో ఫండ్స్‌లోకి రూ. 19,186 కోట్లు వచ్చాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ఇదే రూట్‌లో వచ్చిన రూ.18,838 కోట్లతో పోలిస్తే పెరిగిందని వెల్లడించింది. సిప్ అకౌంట్లు ఫిబ్రవరి నాటికి 8.20 కోట్లకు పెరిగాయని యాంఫీ సీఈఓ వెంకట్ చలసాని అన్నారు.
కిందటి నెలలో 49.79 లక్షల కొత్త అకౌంట్లు ఓపెన్ అయ్యాయని చెప్పారు. మొత్తంగా మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ కిందటి నెలలో రూ.1.2 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లను చూసింది. డెట్ ఫండ్స్‌లోకి ఏకంగా రూ.63,809 కోట్లు, ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.26,866 కోట్లు, హైబ్రిడ్ ఫండ్స్‌లోకి రూ.18,105 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్ చేస్తున్న మొత్తం అసెట్స్ విలువ ఫిబ్రవరి నాటికి రూ.54.54 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది జనవరి నాటికి ఈ నెంబర్ రూ.52.74 లక్షల కోట్లుగా ఉంది.