సెమీ కండక్టర్ల ఇండస్ట్రీతో 80 వేల ఉద్యోగాలు

సెమీ కండక్టర్ల ఇండస్ట్రీతో 80 వేల ఉద్యోగాలు

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా మైక్రోన్, అప్లైడ్ మెటీరియల్స్,  లామ్ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌తో సహా పలు పెద్ద కంపెనీలు మనదేశంలో సెమీ కండక్టర్ల ఇండస్ట్రీల్లో ఇన్వెస్ట్​ చేస్తామని ప్రకటించాయని, ఫలితంగా 80 వేల ఉద్యోగాలు రావొచ్చని  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం చెప్పారు. పరోక్షంగా మరింత మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ కంపెనీలు ఇండియాకు రావడంతో ఎలక్ట్రానిక్​, సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌ భారీగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. యూఎస్​ మెమరీ చిప్ సంస్థ మైక్రోన్ టెక్నాలజీ గుజరాత్‌‌‌‌‌‌‌‌లో తన సెమీకండక్టర్ అసెంబ్లీ  టెస్ట్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయనుందని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం 2.75 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 22,540 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ గురువారం తెలిపింది.  

రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ ప్లాంటు వల్ల 5,000 కొత్త ఉద్యోగాలు,  15,000 కమ్యూనిటీ ఉద్యోగాలు వస్తాయని మైక్రాన్ తెలిపింది. అప్లైడ్​ మెటీరియల్స్​ 400 మిలియన్​ డాలర్లు ఇన్వెస్ట్​ చేయనుంది. ఇది బెంగళూరులో ఇంజనీరింగ్​ సెంటర్​ను నిర్మించనుంది. ల్యామ్​ రీసెర్చ్​ 60 వేల మంది ఇండియన్​ ఇంజనీర్లకు సెమీకండక్టర్ల డెవెలప్​మెంట్​పై శిక్షణ ఇవ్వనుంది. ఇదిలా ఉంటే సెమీకండక్టర్ల తయారీకి వేదాంత–ఫాక్స్​కాన్​ ఇచ్చిన ప్రపోజల్​పరిశీలనలో ఉందని మంత్రి రాజీవ్​ చెప్పారు.