
డ్రగ్స్ పై నార్కో టిక్ బ్యూరో పోలీసులు ఉక్కుపాదం మోపుతూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ రవాణా మాత్రం ఆగడంలేదు. మరోసారి హైదరాబాద్ మాదాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిన డ్రగ్స్ ను నార్కోటిక్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు.డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న సాయి చరణ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
డ్రగ్స్ ని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ట్రావెల్స్ డ్రైవర్స్ ద్వారా బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి చరణ్ నుంచి పెద్ద మొత్తంలో ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సాయిచరణ్ తోపాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యం అనే నలుగురు వ్యాపారవేత్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతంలోనూ సాయిచరణ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ లలో ఉన్న దాదాపు 50 మంది వ్యాపారవేత్తలకు సాయి చరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజేశ్వరి ట్రావెల్స్, జీవీఆర్ ట్రావెల్స్, స్టార్ట్ ట్రావెల్స్, చెర్రీ ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.