ఫైళ్లు ముట్టట్లే.. ముందుకు కదలట్లే!.. హెచ్ఎండీఏలో భారీగా అప్లికేషన్లు పెండింగ్

ఫైళ్లు ముట్టట్లే.. ముందుకు కదలట్లే!.. హెచ్ఎండీఏలో భారీగా అప్లికేషన్లు పెండింగ్
  •     సంస్థ ప్రక్షాళనపై  కొత్త సర్కార్ ఫోకస్
  •     బదిలీలతో ఉద్యోగుల్లో నెలకొన్న టెన్షన్ 
  •     ఫైళ్లు పరిశీలించే టైం లేదంటున్న ఆఫీసర్లు  
  •     టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోనే లేట్ అంటున్న సిబ్బంది 
  •     `ఆఫీసుల చుట్టూ దరఖాస్తుదారుల చక్కర్లు

హైదరాబాద్,వెలుగు : హైదరాబాద్ ​మెట్రోపాలిటన్ నగరాభివృద్ధి సంస్థ(హెచ్​ఎండీఏ) ప్రక్షాళనపై కొత్త ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొందరు ముఖ్య అధికారులను బదిలీ చేసింది. మరికొందరిపైనా దృష్టిసారించింది. దీంతో సర్కార్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆఫీసర్లు, సిబ్బందిలో టెన్షన్ నెలకొంది. మరోవైపు ప్లానింగ్​విభాగంలో పెద్దఎత్తున దరఖాస్తులు పెండింగ్​ పడ్డాయి. జోనల్​ఆఫీసుల్లోనూ భారీగానే ఫైళ్లు పేరుకుపోయాయి.  ఎవరిపై ఎప్పుడు వేటు పడుతుందోనని చాలామంది అధికారులు ఫైళ్లను కూడా చూడడంలేదు.

ఇందుకు పలు రకాల కారణాలు చూపుతుండడం గమనార్హం. కొందరు ఆఫీసర్లు  జోనల్​ ఆఫీసుల నుంచి ఫైళ్లు రావడం లేదని అంటుండగా, సిబ్బంది మాత్రం హెడ్డాఫీసులో ప్రాబ్లమ్ ఉందని చెబుతున్నారు. మరికొందరు అధికారులు టెక్నికల్ సమస్యలతో ఇబ్బందులు వస్తున్నాయని, అందుకే టైమ్ కు ఫైళ్లు క్లియర్​చేయలేకపోతున్నామని పేర్కొంటున్నారు. హెచ్ఎండీఏ హెడ్డాఫీసు అమీర్ పేటలో ఉండగా.. శంకర్​పల్లి, మేడ్చల్, శంషాబాద్, ఘట్​కేసర్​లో జోనల్​ఆఫీసులు ఉన్నాయి.

బిల్డింగ్, లే అవుట్, కమర్షియల్ భవనాలు, ఎల్ఆర్ఎస్, ల్యాండ్​కన్వర్షన్ల అనుమతులకు జోనల్​ఆఫీసుల్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత హెడ్డాఫీసుకు వస్తే.. ప్లానింగ్​డైరెక్టర్లు, కమిషనర్​స్థాయి అధికారి పరిశీలించి పర్మిషన్లు ఇస్తారు. ప్రస్తుతం పలువురు నిర్మాణదారులు, బిల్డర్లు పెద్దసంఖ్యలో  హెడ్డాఫీసు చుట్టూ తిరుగుతున్నారు.  పనులు కాకపోతుండగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తమ ఫైళ్లను పరిశీలించాలంటూ ఆఫీసర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

టెక్నికల్ ప్రాబ్లమ్స్ పేరిట పెండింగ్  

 జోనల్ ఆఫీసుల పరిధిలో నిర్మాణదారులు, డెవలపర్లు, కొత్తగా వెంచర్లు వేసేవారు లే అవుట్​పర్మిషన్లకు అక్కడే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. కొంతకాలం కిందట గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఆన్​లైన్​లోనే  చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. సెంటర్​ఫర్​గుడ్​గవర్నెన్స్(సీజీజీ)కు ఎల్ఆర్ఎస్​దరఖాస్తులను రికార్డు బాధ్యతలు అప్పగించారు. దీంతో నాలుగు జోన్లలో వేలాదిమంది ఎల్ఆర్ఎస్ ఆన్ లైన్ లో అప్లై చేసుకున్నారు. 3 నెలలుగా పర్మిషన్లు రావడం లేదని చాలామంది నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీనికి ప్రధాన కారణంగా ఆఫీసర్లు టెక్నికల్ సమస్యలను చూపుతున్నారు. మరోవైపు హెచ్ఎండీఏ, సీజీజీ మధ్య కో ఆర్డినేషన్ సరిగా లేక దరఖాస్తుల పరిశీలన కొలిక్కి రాలేదని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. జోనల్ ఆఫీసుల్లో దాదాపు 4 లక్షల మంది ఎల్ఆర్ఎస్​కు అప్లై చేయగా. ఇప్పటివరకూ వాటికి మోక్షం లభించలేదు.

అక్రమ నిర్మాణాల రెగ్యులరైజేషన్ సంబంధించి కూడా లక్షల్లో అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మూడేళ్ల కిందట అక్రమనిర్మాణాల క్రమబద్దీకరణ, ఎల్ఆర్ఎస్​కు రూ. 1000 చెల్లించి అప్లై చేసుకున్నా.. ఇప్పటివరకూ వాటికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని అంటున్నారు. దీనిపై అధికారులను సంప్రదిస్తే టెక్నికల్ సమస్యలున్నట్టు చెబుతూ సమాధానం దాటవేస్తున్నారంటున్నారు. దీంతో ఆఫీసుల చుట్టూ తిరగక తప్పడం లేదంటున్నారు.  

కొత్త సర్కార్ పైనే ఆశలు  

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కోడ్​పేరుతో గత ప్రభుత్వం అనుమతులను పెండింగ్​లో పెట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. జోనల్​ స్థాయిలో అసిస్టెంట్​ప్లానింగ్ ఆఫీసర్ (ఏపీవో)ల నిర్లక్ష్యంతో పాటు హెడ్డాఫీసులో ప్లానింగ్​ విభాగంలో డైరెక్టర్​స్థాయి అధికారులు ఫైళ్లను క్లియర్​చేయడంపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. హెచ్ఎండీఏ కమిషనర్​గా దాన కిషోర్​ వచ్చాక అధికారులు  ఆయన వద్దకు తీసుకెళ్లాలంటేనే ఆందోళన చెందుతుండగా.. ఫైళ్లు ముందుకు కదలడం లేదు.

కొంతకాలంగా హెచ్ఎండీఏలో అధికారుల ప్రక్షాళనతోనే కమిషనర్​బిజీగా ఉన్నారు. కొత్తగా జాయింట్ కమిషనర్ గా ఐఏఎస్ ఆమ్రపాలి కూడా రావడం, ఆమె వివిధ పథకాల పరిశీలనకు వేరే రాష్ట్రాల్లో పర్యటనలు, సీఎం, కమిషనర్​ మీటింగ్ లోనే బిజీగా ఉన్నారు. కమిషనర్, జాయింట్​కమిషనర్​పూర్తిగా ఫైళ్లపై దృష్టిపెట్టడం లేదనే వాదనలు వస్తున్నాయి. రెండు నెలలుగా హెచ్ఎండీఏలో కొత్త ఫైలుపై కమిషనర్ సంతకం చేయలేదని అధికారులు చెబుతున్నారు. అనుమతుల కోసం దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు.  లేట్ అవుతుండగా తీవ్రంగా నష్టపోతున్నామని, వెంచర్లను ప్రారంభించుకోలేకపోతున్నామని నిర్మాణదారులు చెబుతున్నారు.