వచ్చే ఎన్నికల కోసం సోషల్ మీడియాకు భారీ ఆఫర్లు

వచ్చే ఎన్నికల కోసం సోషల్ మీడియాకు భారీ ఆఫర్లు

సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్లు కావాలంటూ నోటిఫికేషన్లు

ఆఫర్లు, రెమ్యునరేషన్ ఇస్తున్న నేతలు 
ఎన్నికల కోసం ఇప్పట్నుంచే సన్నద్ధం
కీలకంగా మారిన సోషల్‌‌‌‌మీడియా ప్రచారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాబోయే సాధారణ ఎన్నికలకు రాజకీయ నాయకులు ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలు పెట్టారు. తమ సోషల్ సైన్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌‌‌‌గా ఉండే వారిని సంప్రదిస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌‌‌‌బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌కు గ్రూప్ అడ్మిన్లు కావాలి అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఈ ఉద్యోగానికి చదువు, వయసుతో సంబంధం లేదు. యజమాని పంపే పోస్టులను ఆయా గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడమే ఉద్యోగం. ఆ పోస్టులో ఉన్న కంటెంట్ మంచి చెడులతో సంబంధం లేకుండా జనాలకు చేరవేయడమే పని. ఇప్పటికే గ్రూపు అడ్మిన్లుగా ఉన్న వారికి ఈ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రూపులు, గ్రూపులో ఉన్న సభ్యుల సంఖ్య, పోస్టుల సంఖ్యను బట్టి రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు. కొత్తగా గ్రూపులు క్రియేట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారు. ఈ రిక్రూట్‌‌‌‌మెంట్ కోసం కూడా వాట్సాప్‌‌‌‌ గ్రూపుల్లోనే నోటిఫికేషన్లు ఇస్తున్నారు.
గత రెండు ఎన్నికల ఎఫెక్ట్
దుబ్బాక, జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల ప్రచారం బహిరంగ వేదికల కంటే, సోషల్ మీడియాలోనే ఎక్కువగా జరిగింది. మంచి చెడులు, తప్పు ఒప్పులతో సంబంధం లేకుండా ఒకరిపై ఒకరు తప్పుడు ప్రచారం చేసుకునేందుకు, ఆ ప్రచారాన్ని జనాల్లోకి వేగంగా తీసుకెళ్లి అవతలి వ్యక్తిపై నెగిటివిటీని పెంచేందుకు సోషల్ మీడియాను గత రెండు ఎన్నికల్లో బాగా వాడుకున్నారు. ఎన్నికలకు ముందు రోజు, ఎన్నికల రోజు కూడా లేనిపోనివన్నీ సృష్టించి ప్రత్యర్థుల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నాలు జరిగాయి. రాబోయే సాధారణ ఎన్నికల్లోనూ సోషల్ మీడియా ప్రచారమే కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలన్నీ తమ తమ సోషల్ మీడియా బలగాన్ని పెంచుకునే పనిని ప్రారంభించాయి. ఇందుకోసం పార్టీ కార్యకర్తల్లో యాక్టివ్‌‌‌‌గా ఉండే వారిని ఎంపిక చేసుకుని ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాయి.
నిరుద్యోగులకు ఉపాధి
పెద్దగా పెట్టుబడి లేని బిజినెస్ కావడంతో సోషల్ మీడియా క్యాంపెయిన్‌‌‌‌ చేస్తాం అంటూ చాలా సంస్థలు పుట్టుకొచ్చాయి. ఈ సంస్థలు సర్వే కోసం, క్యాంపెయిన్‌‌‌‌ కోసం సిబ్బందిని నియమించుకుంటున్నాయి. ఒక్కో పనికి ఒక్కో రేటు పెట్టుకుని ఈ సంస్థల ప్రతినిధులు అన్ని పార్టీల నాయకులను సంప్రదిస్తున్నారు. నాయకుని ప్రతి కదలికను, ప్రతి మాటను రికార్డు చేసి మీమ్స్‌‌‌‌, ఫొటోలు, పోస్టర్లు ఆసక్తికరంగా క్రియేట్‌‌‌‌ చేసి జనాల్లోకి చేరవేస్తున్నారు. ఇంకొన్ని సంస్థలు జనాల మూడ్ ఎలా ఉందో సర్వేలు చేసి తెలుసుకొని ఇస్తున్నాయి. నియోజకవర్గంలో ఎక్కువ మందికి ఉన్న సమస్యలు ఏంటి, తమ యజమాని (నాయకుడు) ఏ సమస్యపై స్పందిస్తే ఎక్కువ మైలేజ్ వస్తుందో అంచనా రూపొందిస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి సంస్థలతో అగ్రిమెంట్​చేసుకునేందుకు, వ్యక్తులను నియమించుకునేందుకు నాయకులు మొగ్గు చూపుతున్నారు. ఇలా ఇది నిరుద్యోగులకు తాత్కాలికంగా కొంత ఉపాధి ఇస్తున్నది.
పర్సనల్ టీమ్స్‌‌‌‌
తమ పార్టీ సోషల్ టీమ్స్‌‌‌‌ మీదనే పూర్తిగా ఆధారపడకుండా నాయకులు తమకంటూ సొంత వ్యవస్థను నియమించుకుంటున్నారు. కంటెంట్ రైటర్లు, డిజైన్లర్లు, మీమ్ క్రియేటర్స్‌‌‌‌, జనాల మూడ్ తెలుసుకునేందుకు సర్వే సిబ్బందిని రిక్రూట్‌‌‌‌ చేసుకుంటున్నారు. వీరి ద్వారా రోజూ తాము పాల్గొనే కార్యక్రమాలను, తమ కంటెంట్‌‌‌‌ను ఆసక్తికరంగా తయారు చేసి జనాల్లోకి చేరవేస్తున్నారు. వీటిని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల జనాలకు పంపేందుకు కొత్తగా చేర్చుకుంటున్న (రిక్రూట్​చేసుకున్న) వాట్సాప్, టెలిగ్రామ్ అడ్మిన్లను వాడుకుంటున్నారు.