V6 News

రష్యా, ఆఫ్రికా దేశాల నుంచి భారీగా ఆయిల్.. మిడిల్ ఈస్ట్ నుంచి 61 శాతం పడిపోయిన దిగుమతులు

రష్యా, ఆఫ్రికా దేశాల నుంచి భారీగా ఆయిల్.. మిడిల్ ఈస్ట్ నుంచి 61 శాతం పడిపోయిన దిగుమతులు
  • రష్యా, వెనెజువెలా, అంగోలా వైపు చూస్తున్న ఇండియా
  • బ్రెంట్ ధర కంటే 5–15 డాలర్లు.. ఎక్కువ చెల్లింపు

ముంబై: ఇండియా రష్యా, ఆఫ్రికా దేశాల నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది.  పశ్చిమాసియా ఉద్రిక్తతలతో మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్న ఆయిల్‌‌ 61 శాతం పడిపోయింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌‌లో మిడిల్‌‌ ఈస్ట్ దేశాల నుంచి 1.1–1.2 మిలియన్ బ్యారెల్స్ పెర్ డే (బీపీడీ) ఆయిల్‌‌ను ఇండియా కొనుగోలు చేసింది. 

ఇది ఫిబ్రవరితో పోలిస్తే 61 శాతం తక్కువ.  ఇండియా మొత్తం ఆయిల్ దిగుమతుల్లో  మిడిల్ ఈస్ట్ దేశాల వాటా 26.3 శాతానికి తగ్గింది. ఇది చరిత్రలోనే కనిష్టస్థాయి. ఈ లోటును భర్తీ చేయడానికి రష్యా, ఆఫ్రికా వైపు ఇండియా చూస్తోంది.  అంతేకాకుండా కొన్ని దేశాలకు బ్రెంట్ ధరపై 5–15 డాలర్ల ఎక్కువ చెల్లిస్తోంది.

రష్యా కీలకం 
ఇటువంటి పరిస్థితుల్లో రష్యా చమురు ప్రధాన ఆధారంగా మారింది. ఈ ఏడాది మార్చిలో భారత రిఫైనరీలు రోజుకు సగటున 1.98–2.25 మిలియన్‌‌ బీపీడీ చమురును దిగుమతి చేసుకున్నాయి. ఇది జనవరి, ఫిబ్రవరిలోని ఒక మిలియన్‌‌ బ్యారెల్స్‌‌ నుంచి దాదాపు రెట్టింపు. అమెరికా తాత్కాలిక మినహాయింపు ఇవ్వడంతో చాలా రిఫైనరీలు రష్యా స్టాక్‌‌ను పెంచుకుంటున్నాయి. వచ్చే నెల 16 తో ఈ డెడ్‌‌లైన్ ముగియనుంది.   ఇండియా అదనంగా 60 మిలియన్ బ్యారెల్స్‌‌ ఆయిల్‌‌ను రష్యా నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఇతర దేశాల నుంచి..
ట్రేడ్ రీసెర్చ్  కంపెనీ కెప్లర్ ప్రకారం,  ఇండియా  ఈ ఏడాది మార్చిలో ఆఫ్రికన్ దేశాలు  అంగోలా నుంచి 3.27 లక్షల బీపీడీ  దిగుమతి చేసింది. నైజీరియా నుంచి కూడా దిగుమతులు పెంచింది.  ఇరాన్‌‌, వెనెజువెలా నుంచి కూడా సరఫరాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌‌ మధ్య నాటికి ఇరాన్‌‌ నుంచి 2.76 లక్షల బీపీడీ, వెనెజువెలా నుంచి 1.37 లక్షల బీపీడీ వచ్చాయి. 

డైవర్షిఫికేషన్ జరిగినా, ఇండియా మొత్తం ఆయిల్ దిగుమతులు ఈ ఏడాది మార్చిలో  4.5 మిలియన్‌‌ బీపీడీకి తగ్గాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో  5.2 మిలియన్  బీపీడీ ఆయిల్ కొనుగోలు చేశాం. ఆఫ్రికా చమురు పూర్తిగా మిడిల్ ఈస్ట్‌‌  సరఫరాను భర్తీ చేయలేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

భారత రిఫైనరీలు వేరే గ్రేడ్‌‌ చమురుకు అనుగుణంగా ఏర్పాటయ్యాయని తెలిపారు. ధరల పరంగా కూడా ఒత్తిడి పెరుగుతోందన్నారు.  అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు పెట్రోలు, డీజిల్‌‌ ధరలను పెంచలేదు. ఎక్సైజ్‌‌ సుంకాలను తగ్గించడం ద్వారా వినియోగదారులను రక్షిస్తోంది. 

కొంతమంది విశ్లేషకులు ఎన్నికలు ముగిసిన తర్వాత లీటరుకు 28 రూపాయల వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ధరల పెంపు తక్షణం జరగదని చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గత నాలుగేళ్లుగా భారత్‌‌లో పెట్రోలు, డీజిల్‌‌ ధరలు పెరగలేదని, అంతర్జాతీయ ధరల పెరుగుదల నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపింది.