గుజరాత్​ గజగజ..సహాయక చర్యల కోసం భారీగా రెస్క్యూ టీమ్స్

గుజరాత్​ గజగజ..సహాయక చర్యల కోసం భారీగా రెస్క్యూ టీమ్స్
  • గుజరాత్‌‌లోని కచ్‌‌లో తీరాన్ని తాకిన ‘బిపర్‌‌జాయ్‌‌’
  • దట్టమైన మేఘాలు.. భీకర గాలులతో కుండపోత వర్షం
  • తీర ప్రాంతాల్లో కూలిన చెట్లు, కరెంటు స్తంభాలు
  •  94 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

జఖౌ/అహ్మదాబాద్:  గుజరాత్‌‌ను ‘బిపర్‌‌జాయ్‌‌’ తుఫాను కమ్మేసింది. గురువారం సాయంత్రం తీరాన్ని తాకిన సైక్లోన్.. దట్టమైన మేఘాలతో కమ్మేసి, భీకర గాలులతో కుండపోతగా కురుస్తున్నది. ద్వారక, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 కోస్టల్ జిల్లాల్లోని  94 వేల మంది తాత్కాలిక షెల్టర్లలో తలదాచుకుంటున్నారు. పలు జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌‌లు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌‌‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌‌‌‌ఎఫ్ బృందాలు సిద్ధమయ్యాయి.

పూర్తిగా తీరం దాటేందుకు 6 గంటలు

కొన్ని రోజులుగా గుజరాత్ తీర ప్రాంతాలను బిపర్‌‌‌‌జాయ్ వణికిస్తున్నది. గురువారం సాయంత్రం కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్‌‌పత్ సమీపంలో నీటి మీది నుంచి నేల మీదికి ‘ల్యాండ్’ అయింది. వస్తూనే విరుచుకుపడింది. గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షంగా కురుస్తున్నది. కచ్, ద్వారక తదితర ప్రాంతాల్లో మేఘాలు కమ్మేశాయి. 

బిపర్‌‌జాయ్‌‌ తుఫాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు దాదాపు 6 గంటలకు పైగా సమయం పట్టిందని, గురువారం అర్ధరాత్రి సమయంలో పూర్తిగా తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటిన తర్వాత తీవ్ర తుపానుగా.. తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని తెలిపారు. కచ్‌‌ - సౌరాష్ట్ర ప్రాంతాలు, పోర్‌‌బందర్‌‌, ద్వారక, జామ్‌‌నగర్‌‌, రాజ్‌‌కోట్‌‌, జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే ద్వారక, పోర్‌‌బందర్‌‌, జామ్‌‌నగర్‌‌, మోర్బీ తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 6 మీటర్ల  మేర ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

రంగంలోకి సహాయక బృందాలు

రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఎన్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌ నుంచి 18 బృందాలు, ఎస్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్ నుంచి 12 బృందాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, బీఎస్ఎఫ్ జవాన్లను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. అలలు ఉధృతంగా ఉంటాయని, ఎవరూ తీరం వద్దకు వెళ్లొద్దని సూచించారు. అన్ని బీచ్‌‌లలోనూ లైఫ్‌‌గార్డులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రోడ్లు భవనాల శాఖకు చెందిన 115 బృందాలు, విద్యుత్‌‌ శాఖకు చెందిన 397 బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌ఫోర్స్‌‌, ఇండియన్‌‌ కోస్ట్‌‌ గార్డ్‌‌ దళాలను కూడా రంగంలోకి దించేందుకు కేంద్రం సిద్ధం చేసి ఉంచింది. ‘‘భుజ్, జామ్‌‌నగర్, గాంధీధామ్, ధ్రంగాధ్ర, నాలియా, ద్వారక, మాండ్విలో 27 రిలీఫ్ టీమ్స్‌‌ను ఆర్మీ ఏర్పాటు చేసింది. 

వడోదర, అహ్మదాబాద్, ఢిల్లీలో ఒక్కో హెలికాప్టర్‌‌‌‌ను ఎయిర్‌‌‌‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఒఖా, పోరుబందర్, బకాసుర ఏరియాల్లో రిలీఫ్, రెస్క్యూ కోసం బృందాలను నేవీ సిద్ధంగా ఉంచింది” అని అధికారులు చెప్పారు. ద్వారక జిల్లాలోని జఖౌ, మాండ్వి పట్టణాల్లో గాలుల ధాటికి అనేక చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ద్వారకలో చెట్లు కూలిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ద్వారకలో కూలిన కరెంటు స్తంభాల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. మరోవైపు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పశ్చిమ రైల్వే 99 రైళ్లను రద్దు చేసింది. 

స్పేస్ నుంచి ఫొటోలు తీసిన ఆస్ట్రొనాట్

సైక్లోన్ బిపర్‌‌‌‌జాయ్ ఫొటోలను స్పేస్ నుంచి తీశాడో ఆస్ట్రొనాట్. యూఏఈకి చెందిన సుల్తాన్ అల్ నెయది.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తీసిన ఫొటోలను ట్విట్టర్‌‌‌‌లో షేర్ చేశారు. అంతరిక్షం నుంచి చూస్తే అరేబియా సముద్రంపై దట్టంగా కమ్మేసిన తుఫాను మేఘాలు అందంగా కనిపిస్తున్నాయి. తాను రెండు రోజుల్లో ఆ ఫొటోలను తీసినట్లు సుల్తాన్ చెప్పారు. అంతకుముందు బిపర్ జాయ్ తుఫానుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

ఊర్లన్నీ ఖాళీ.. 

బిపర్‌‌జాయ్‌‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కచ్ జిల్లాలోని 47 వేల మంది సహా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని మొత్తం 94 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 8,900 మంది పిల్లలు, 1,131 మంది గర్భిణులు, 4,697 మంది పెద్దలు ఉన్నారు. వీరి కోసం మొత్తం 1,521 షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేయగా.. మెడికల్ టీమ్స్ తరచూ ఈ షెల్టర్లను విజిట్ చేస్తున్నాయని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని ఊర్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. తుఫాను తీరం దాటే పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌‌ అమల్లో ఉంది. ఆలయాలు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. సముద్రంలో చేపల వేటపై శుక్రవారం రాత్రి దాకా నిషేధం విధించారు. అన్ని పోర్టులను మూసేశారు. షిప్పులను లంగర్లు వేసి నిలిపి ఉంచారు.