మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఏపీలో మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా ఎన్ కౌంటర్

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఏపీలో మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా ఎన్ కౌంటర్

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ అల్లూరి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయినట్లు ఏపీడీజీపీ ప్రకటించారు. మొత్తం ఆరు మంది మృతుల్లో హిడ్మా భార్య కూడా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. 

మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా భద్రతా బలగాలకు కొరకరాని కొయ్యగా తయారయిన సంగతి తెలిసిందే. ఇతడు దక్షిణ బస్తర్ పరిధిలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన వ్యక్తి. బస్తర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన ఏకైక ఆదివాసీ నేత. భారీ ఆయుధాలు కలిగిన 350 మంది సభ్యుల మావోయిస్టుల బెటాలియన్ 1కి హిడ్మా కమాండర్‌‌గా ఉన్నాడు. ఇతడు ఎక్కడుంటే అక్కడ.. ఆయనకు మూడంచెల భద్రత కోసం వందల మంది మావోయిస్టులు ఉంటారు. 

భద్రతా దళాలకు చిక్కకుండా తప్పించుకోవడంలో హిడ్మా నేర్పరి. దండకారణ్యం మొత్తం అతనికి కొట్టిన పిండి. అనేక ఎన్ కౌంటర్ల నుంచి హిడ్మా త్రుటిలో తప్పించుకున్నాడు. చివరకు ఏపీలోని రంపచోడవరం పరిధిలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లో హిడ్మా చనిపోయినట్లు ఏపీ డీజీపీ మంగళవారం ప్రకటించారు.

ఏపీ అల్లూరి జిల్లాలోని మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం (నవంబర్ 18) ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఏపీ రంపచోడవరం దగ్గర ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు AP DGP తెలిపారు. 

మావోయిస్టు అగ్రనేత హిడ్మాపై ఇప్పటికే  కోటి రూపాయల రివార్డు ఉంది. అదే విధంగా అతని భార్య హేమపై 50 లక్షల రూపాయల రివార్డు ఉంది. 25 ఏళ్ల క్రిత అడవుల్లోకి వెళ్లిన హిడ్మా.. అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయాడు.