న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్లో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) నికర లాభం (కన్సాలిడేటెడ్)1.08 శాతం పెరిగి రూ.2,508 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కంపెనీ నికర లాభం రూ.2,481 కోట్లుగా ఉందని హెచ్‌యుఎల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ క్వార్టర్లో ఉత్పత్తుల విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం వార్షికంగా స్వల్పంగా రూ.15,259 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఏడాది కాలంలో ఇది రూ.15,314 కోట్లుగా ఉంది.
డిసెంబర్ క్వార్టర్లో హెచ్‌యూఎల్ మొత్తం ఖర్చులు రూ.12,305 కోట్లుగా ఉన్నాయి. మొత్తం ఆదాయం స్వల్పంగా 0.47 శాతం పెరిగి రూ.15,781 కోట్లకు చేరిందని, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే రూ.15,707 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. డిసెంబర్ క్వార్టర్లో, హోమ్ కేర్ అండ్ బ్యూటీ, పర్సనల్ కేర్ వ్యాపారం బాగుందని తెలిపింది. ఎబిటా డిసెంబర్ క్వార్టర్లో 23.7 శాతంగా ఉంది. ఇది 2023 ఆర్థిక సంవత్సరం మూడవ క్వార్టర్లో నమోదైన సంఖ్యతో పోలిస్తే 10 బేసిస్ పాయింట్లు ఎక్కువ. హోమ్ కేర్ సెగ్మెంట్ నుంచి హెచ్‌యూఎల్ ఆదాయం 1.26 శాతం తగ్గి రూ.5,444 కోట్లకు చేరుకుంది.
