- బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా సమీపంలో ఘోరం
- దాడికి బాధ్యత వహించిన బలోచ్ లిబరేషన్ ఆర్మీ
క్వెట్టా/పెషావర్: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు ఆదివారం మరోసారి రక్తపాతం సృష్టించారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఒక రైలును లక్ష్యంగా చేసుకుని జరిగిన శక్తివంతమైన ఆత్మాహుతి (ఫిదాయీ) పేలుడులో కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది.
ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న రైలు స్టేషన్ సమీపంలోని సిగ్నల్ దాటుతుండగా.. పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం రైలు బోగీని ఢీకొట్టినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువమంది సైనికులే ఉన్నారని వెల్లడించారు. మరోవైపు, వాయవ్య పాకిస్తాన్‌లో జరిగిన మరో దాడిలో నలుగురు స్థానిక పీస్ కమిటీ సభ్యులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు.
షటిల్ రైలును లక్ష్యంగా చేసుకుని దాడి..
క్వెట్టా కంటోన్మెంట్ నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న షటిల్ రైలును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ పేలుడు ధాటికి రైలు ఇంజిన్ తోపాటు 3 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక బోగీలో భారీగా మంటలు చెలరేగాయి.
ఈద్ పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లేందుకు కనెక్టింగ్ రైళ్లు పట్టుకోవాలనే ఆరాటంతో ప్రయాణిస్తున్న సామాన్య పౌరులు, సైనిక కుటుంబాలు ఇందులో ఎక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని భవనాల కిటికీలు, వాహనాల అద్దాలు ముక్కలైపోయాయి. రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు చోటుచేసుకోవడంతో రైళ్ల రాకపోకల్లో అంతరాయం కలిగినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, ఈ దాడికి తామే బాధ్యులమని నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ’ (బీఎల్‌ఏ) ప్రకటించింది. తమ సంస్థకు చెందిన ఆత్మాహుతి విభాగం '‘మజీద్ బ్రిగేడ్’ ఈ దాడిని నిర్వహించిందని, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే ఈ దాడి చేసిందని పేర్కొంది.
ఈ వరుస దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఈ దాడులను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
