
బషీర్బాగ్, వెలుగు: మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. సర్పంచుల పెండింగ్ బిల్లులు, ఆత్మహత్యలపై తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరు కావాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను కమిషన్ ఆదేశించింది.
అయితే, పంచాయితీ రాజ్ అధికారులు మరో నెల గడువు కావాలని కోరడంతో కమిషన్ అనుమతించింది. జేఏసీ చైర్మన్ సర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేసిన సర్పంచులు, ఆ అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పెండింగ్ బిల్లులు చెల్లించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కమిషన్ విచారణను సెప్టెంబర్ 16కు వాయిదా వేసిందని సర్వి యాదయ్య తెలిపారు.