హ్యూమనాయిడ్  రోబో కూలీలు వచ్చేస్తున్నాయ్

హ్యూమనాయిడ్  రోబో కూలీలు వచ్చేస్తున్నాయ్
  • ఇండ్ల నిర్మాణంలో బరువులు ఎత్తుతయ్
  • డిజైన్  చేసిన బోస్టన్ డైనమిక్స్  రోబోటిక్స్  కంపెనీ 

వాషింగ్టన్: ఇప్పటి వరకు సర్జరీలు చేసే రోబోలు, ఎమర్జెన్సీ సమయంలో స్పందించే రోబోలు చూశాం. రెస్టారెంట్లలో కస్టమర్లకు సేవలందించే రోబోలు కూడా వచ్చాయి. భారీ బిల్డింగులు, బ్రిడ్జిలు ఎక్కి రిపేర్లు చేసే రోబోలనూ  చూశాం. త్వరలో హ్యూమనాయిడ్  రోబో కూలీలు వచ్చేస్తున్నాయి. ఇండ్లు, బిల్డింగుల నిర్మాణంలో ఈ రోబోలు బరువులు ఎత్తి మనుషులకు అందించి సాయం చేస్తాయి. బరువులను వాటంతట అవే రెండు చేతులతో మోసుకెళ్లి అక్కడ పనిచేసే వారికి అందిస్తాయి. అంతేకాకుండా పరంజాల నిర్మాణంలోనూ హెల్ప్  చేస్తాయి. సామాన్లు అందించిన తర్వాత గాల్లో ఎగిరి బ్యాక్ ఫ్లిప్  వంటి విన్యాసాలు కూడా చేస్తాయి. అమెరికాలోని బోస్టన్  డైనమిక్స్  అనే రోబోటిక్స్  కంపెనీ ఈ రోబోలను డెవలప్  చేసింది. ఈ రోబో రెండు చేతులకు రెండ్రెండు వేళ్లు ఉంటాయి. ఒక వేలు ఫిక్స్ అయి ఉంటే, మరొకటి అడ్జస్టబుల్ గా ఉంటుంది.

ఆ రోబోలకు అట్లాస్  అని పేరు పెట్టారు. ఇండ్ల నిర్మాణానికి ఉపయోగపడే సామర్థ్యం ఉన్న హ్యూమనాయిడ్  రోబోలను డెవలప్  చేయడం సవాలుతో కూడుకున్నదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బిల్డింగుల నిర్మాణంలో కూలీకి ఉండాల్సిన ఫిజికల్  సామర్థ్యం తాము తయారు చేసిన రోబోలకు ఉందని చెప్పారు. ‘‘ఔట్ డోర్, కఠినమైన నేలలపై పనిచేసేలా అట్లాస్​ను రూపొందించాం. అంతేకాకుండా ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనూ సాయం చేసేలా వాటిని తయారు చేశాం. బిల్డింగ్  నిర్మాణంలో అట్లాస్  రోబోలు పరుగెత్తుకుంటూ, పల్టీలు కొడుతూ సాయం చేస్తాయి. వాటి ఎత్తు 4.9 అడుగులు. బరువు 75 కిలోలు” అని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. బిల్డింగ్  నిర్మాణంలో కూలీకి అట్లాస్  రోబో సాయపడుతున్న వీడియోను కంపెనీ రిలీజ్  చేసింది.