ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఆంత్రోపిక్ చెప్పిన కొన్ని రహస్యాలు, హెచ్చరికలు చూస్తుంటే రోబో సినిమా గుర్తొస్తుంది. మనిషి తయారు చేసిన రోబో చివరికి.. మనిషినే సవాల్ చేసి.. ఎంత విధ్వంసం సృష్టిస్తుందో ఆ సినిమాలో చూడవచ్చు. అది సినిమా అయినప్పటికీ.. అలాంటి పరిణామాలు నిజజీవితంలో జరుగేలా ఉన్నాయి.. జరుగుతూనే ఉన్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనకు తానే అభివృద్ధి చెందటం ప్రారంభించిందని.. తనకు తానే నిర్మించుకుంటోందని సంచలన విషయాలు వెల్లడించింది ఆంత్రోపిక్. అలా డెవలప్ అవుతూ తన వారసుడిని కూడా తయారు చేసే అవకాశం ఉందని తెలిపింది. ఏఐ తయారు చేసే ఫూచర్ జనరేషన్ ఏఐ మరింత అడ్వాన్స్డ్ గా, పవర్ ఫుల్ గా ఉంటుందని పేర్కొంది. అదే జరిగితే మానవులు ఊహించలేని.. టచ్ చేయలేని విధంగా ఏఐ తయారవుతుందని హెచ్చరించింది.
భవిష్యత్తులు మనిషి అవసరం లేకుండానే.. మనిషి కోడింగ్ తో పనిలేకుండానే.. తన తర్వాతి తరాన్ని.. అంటే ఏఐ వారసున్ని తయారు చేసుకుంటుందని తెలిపింది.
2026 మే వరకు గమనిస్తే.. 80 శాతం కోడ్ అనేది క్లాడే (Cloude.. ఇది ఆంత్రోపిక్ తయారు చేసిన కోడింగ్ వ్యవస్థ) తయారు చేస్తోందని తెలిపింది. ఏఐ కంపెనీల్లో అడ్వాన్స్డ్ అయిన ఆంత్రోపిక్.. ఏఐ భవిష్యత్ పరిణామాల గురించి హెచ్చిరస్తూనే ఉంది. రానున్న రోజుల్లో ఏఐ మరింత శక్తివంతంగా తయారవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏఐ లో మారుతున్న ధోరణలు చాలా రకంగా అనువదించుకోవచ్చునని తెలిపింది. అయితే సైన్స్, హెల్త్ కేర్ మొదలైన రంగాల్లో ఏఐ తయారు చేసే మాడల్స్.. సాంకేతిక చరిత్రలోనే అద్భతాలుగా నిలుస్తాయని పేర్కొంది.
ఏఐ వ్యవస్థలు తమను తామే నిర్మించుకుని.. తమ వారసులను తయారు చేసుకుంటే.. ఇప్పటి వరకు మనం మానిటర్ చేస్తున్న.. రక్షిస్తున్న, భద్రపరుస్తున్న అని అంశాలలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపింది.
ఏఐ డెవలప్మెంట్ను ఆపేందుకు కంపెనీలు ముందుకు రావాలి:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వస్తున్న వేగవంతమైన మార్పులు మానవ మనుగడకు సవాళ్లు విసరక ముందే మేల్కోవాల్సిన అవసరం ఉందని ఆంత్రోపిక్ తెలిపింది. అడ్వాన్స్డ్ అభివృద్ధిని కాస్త ఆపేందుకు ఏఐ కంపెనీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. అన్ని కంపెనీలు ఒక తాటిపైకి వచ్చి ఏఐ వేగాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఏఐ వేగాన్ని తగ్గించడం లేదా తాత్కాలికంగా ఆపడం చేస్తేనే.. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉంటుందని పేర్కొంది. ఏఐ అభివృద్ధిలో కొన్ని కంపెనీలు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైతే.. అది మిగతా అన్ని కంపెనీలకు, అందరికీ ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించింది.
అయితే ఆంత్రోపిక్ ఏఐ ఇస్తున్న సలహా బాగున్నప్పటికీ.. అమలు చేయడం కష్టతరమైన పనిగా ఏఐ సైంటిస్టులు చెబుతున్నారు. పోటీ ప్రపంచంలో ఒక థాటిపైకి వచ్చి భవిష్యత్తు కోసం కంట్రోల్ చేసుకునేంత ఉదారత కంపెనీలకు ఉందని అనుకోలేమని డా.శ్రీనివాస్ పద్మనాభుని తెలిపారు. అందరినీ ఒప్పించడం చాలా కష్టం.. ఎందుకంటే చాలా మంది తాము వెనకబడి పోయాం.. మరింత ముందుకు వెళ్లాలి అనే ఒత్తిడిలో.. టార్గెట్ తో పనిచేస్తుంటారు. వీళ్లందరినీ ఒకథాటిపైకి తేవడం కష్టతరమైన పనిగా ఆయన తెలిపారు.
