మేడారం హుండీల నిండా నోట్లు, బంగారం

మేడారం హుండీల నిండా నోట్లు, బంగారం

కౌంటింగ్​ సెంటర్​లో ఎటుచూసినా కరెన్సీనే
ఓ వైపు చిల్లర కుప్పలు.. మరోవైపు విదేశీ కట్టలు
4 రోజుల లెక్కింపులో వచ్చిన ఆదాయం రూ. 7 కోట్లు
మరో వారంపాటు కొనసాగనున్న లెక్కింపు
మొత్తం హుండీలు 494.. ఇప్పటిదాకా లెక్కించినవి 247
2018 జాతరలో రూ.10.70 కోట్ల ఆదాయం

వరంగల్రూరల్‍, వెలుగుమేడారం జాతర హుండీలన్నీ భక్తుల కానుకలతో నిండిపోయాయి. వీటిని లెక్కించేందుకు వేదికైన హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపం కరెన్సీ కుప్పలతో కళకళలాడుతోంది. హుండీల నుంచి కుప్పలు తెప్పలుగా కానుకలు పడుతుంటే వాటిని చూసి అక్కడి సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. రూపాయి నాణేలు మొదలు రెండు వేల రూపాయల నోట్ల వరకు హుండీల నుంచి పడుతున్నాయి. ఫారిన్‍ కరెన్సీతో పాటు రద్దయిన ఐదువందల రూపాయల నోట్లు కూడా దర్శనమిస్తున్నాయి. బంగారు కడియాలు, వెండి కడియాలు, కుంకుమ భరిణెలు, వివిధ ప్రతిమలు బయటపడుతున్నాయి. బుధవారం నుంచి లెక్కింపు ప్రారంభమవగా.. శనివారం నాటికి హుండీల నుంచి రూ.7 కోట్ల ఆదాయం ఎండోమెంట్‍ అకౌంట్​లో జమైంది. మరో వారంపాటు లెక్కింపు కొనసాగనుంది. 2018 జాతరలో హుండీల నుంచి రూ.10.70 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.

మొత్తం 494 హుండీలు

భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో 494 హుండీలు ఏర్పాటు చేశారు. ఇందులో 454 ఐరన్‍తో  చేసినవి కాగా, 38 క్లాత్‍ హుండీలు. ఒడిబియ్యం వేసేందుకు వీలుగా 2 ప్రత్యేక హుండీలు ఏర్పాటు చేశారు. జాతర ముగిశాక పటిష్ఠ భద్రత నడుమ వీటన్నింటినీ హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తీసుకొచ్చి సీసీ కెమెరాల నిఘా మధ్య భద్రపరిచారు. బుధవారం ఉదయం నుంచి హుండీలను తెరిచి లెక్కించడం మొదలుపెట్టారు. హుండీల్లోని కానుకలు, డబ్బుల లెక్కింపులో ప్రతిరోజు 300 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఇందులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 200 మంది దేవాదాయశాఖ సిబ్బంది ఉన్నారు. మరో 100 మంది మహబూబాబాద్‍ జిల్లా శ్రీలక్ష్మీవెంకటేశ్వర సేవా సమితి వాళ్లు ఉన్నారు. ఇప్పటివరకు 247 హుండీల్లోని కానుకలను లెక్కించారు.

ఎవ్వరి పని వారిదే..

హుండీల లెక్కింపును ఆఫీసర్లు ఎప్పటికప్పుడు మానిటర్‍ చేస్తున్నారు. హుండీలు తెరవడానికి ఓ టీం.. అందులోని బియ్యం, నోట్లు, వెండి, బంగారం వస్తువులను వేరు చేయడానికి మరో టీం.. బెల్లం, పసుపు, కుంకుమ అంటినవాటిని సర్ఫ్​తో క్లీన్‍ చేసేందుకు ఇంకో టీం..  వాటిని ఆరబెట్టడానికి ఓ బ్యాచ్​… గుట్టలుగా ఉన్న నోట్లను వేరుచేసేందుకు ఇంకో బ్యాచ్‍ .. వాటిని వంద చొప్పున కట్ట కట్టేందుకు మరో బ్యాచ్​.. ఇలా ఎవ్వరి పనిని వారు చేసుకుంటూ పోతున్నారు. వీరందరినీ ఎండోమెంట్​ అడిషనల్‍ కమిషనర్‍, డిప్యూటీ కమిషనర్‍,  ఇతర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్​ చేస్తున్నారు. లెక్కింపు కోసం వచ్చే మగ సిబ్బందిని గుర్తించడానికి వైట్‍ బనియన్‍, ఆరేంజ్‍ కలర్‍ లుంగీని డ్రెస్‍కోడ్‍గా పెట్టారు. మహిళలకు మాత్రం డ్రెస్‍ కోడ్‍ విషయంలో మినహాయింపు ఇచ్చారు.

తడిసిన  నోట్లపై స్పెషల్​ ఫోకస్​

మేడారం మహాజాతర చివర్లో భారీ వర్షం కురవడంతో అక్కడి హుండీల్లోనూ వాన నీరు చేరింది. దీంతో భక్తులు వేసిన కానుకలు, డబ్బులు తడిసిపోయాయి. హుండీల్లో బెల్లం, బియ్యం కూడా వేయడంతో నోట్లు ఒకదానికొకటి అతుక్కుపోయాయి. వాటిని లెక్కించేందుకు సిబ్బంది స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. అలాంటి నోట్లను మొదట సర్ఫ్​ నీళ్లతో కడిగి శుభ్రపరుస్తున్నారు. ఆపై ఫ్లడ్‍ లైట్ల వెలుతురులో ఆరబెట్టి అనంతరం కౌంట్‍ చేస్తున్నారు. నోట్లకు కొద్దిగా కలర్‍ అంటినా తీసుకునేలా ముందే బ్యాంకర్లతో మాట్లాడారు. లెక్కించిన డబ్బులను, కానుకలను ఏరోజుకారోజు సాయంత్రం అధికారులు దేవాదాయ శాఖ బ్యాంక్​ అకౌంట్లలో జమ చేస్తున్నారు. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి శనివారం నాటికి అంటే నాలుగురోజుల్లో  రూ.7,00,62,000 అకౌంట్​లో జమయ్యాయి.

రద్దయిన నోట్లు, ఫారిన్‍  కరెన్సీ

ఈ సారి మేడారం హుండీల్లో ఫారెన్ కరెన్సీ కూడా ఎక్కువగానే ఉంది. విదేశాల నుంచి వచ్చిన భక్తులకుతోడు ఇక్కడి నుంచి ఫారిన్‍ కంట్రీలకు పోయినోళ్లు సైతం ఫారెన్​ కరెన్సీనే కానుకలుగా సమర్పించుకున్నారు.  రద్దయిన 500 నోట్లు కూడా హుండీల్లో దర్శనమిస్తున్నాయి. జాతరలో భక్తులు తమ మొక్కుల్లో భాగంగా గోల్డ్​, సిల్వర్‍ వస్తువులను కానుకలుగా వేశారు. ఇందులో కుంకుమ భరణిలు, కడియాలు, వివిధ ప్రతిమలు  ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా వచ్చిన బంగారు, వెండి కానుకలను ఆఫీసర్లు ప్రత్యేక హుండీలో వేసి అధికారుల పర్యవేక్షణలో తాళాలు వేసి భద్రపరుస్తున్నారు. లెక్కింపు మొత్తం పూర్తయ్యాక.. హైదరాబాద్‍ నుంచి  జ్యూయలరీ విభాగానికి చెందిన ఆఫీసర్‍ వచ్చి కానుకల్లో గోల్డ్​, సిల్వర్‍ ఐటెంల బరువు, విలువను అంచనా వేయనున్నారు. నోట్లు కాకుండా.. హుండీల్లోని చిల్లర పైసలను చివర్లో లెక్కించనున్నారు. భక్తులు వేసిన టన్నులకొద్దీ ఒడిబియ్యంలో చిల్లర పైసలు కలిసిపోయాయి. జల్లెడ సాయంతో బియ్యం, నాణేలను వేరుచేయాల్సి ఉంటుంది. అనంతరం రూపాయి, రెండు, ఐదు రూపాయల లెక్కన కౌంట్​ చేయనున్నారు. అదే సమయంలో బియ్యాన్ని అధికారులు టెండర్‍ ప్రక్రియ ద్వారా బయటి వ్యక్తులకు అమ్మనున్నారు.

మరో వారం దాకా లెక్కింపు

ఈసారి అమ్మవార్లకు వచ్చిన కానుకలు లెక్కించడానికి మరో వారంరోజుల సమయం పట్టే అవకాశం ఉందని దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్‍ శ్రీనివాసరావు పేర్కొన్నారు. 2018 జాతర సమయంలో లెక్కింపునకు వారం టైం పట్టగా.. ఈసారి హుండీల్లోకి వర్షపు నీరు చేరడం, బెల్లం, బియ్యంతో నోట్లన్నీ అతుక్కుపోతుండటంతో వాటిని శుభ్రపరచడానికి ఎక్కువ సమయం పడుతోందని ఆయన తెలిపారు.

ఆదాయంలో మూడోవంతు గిరిజన పూజారులకే

ఆదివాసీ సంప్రదాయం ప్రకారం మేడారం జాతరలో భక్తుల నుంచి వచ్చే కానుకల ఆదాయంలో ప్రధాన పూజరుల కుటుంబాలకు వాటా ఉంది. మొత్తం ఆదాయంలో మూడో వంతు(33.33 శాతం) వారికి ఇవ్వాలనే సుప్రీంకోర్టు ఆదేశం మేరకు దేవాదాయశాఖ చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగానే ఎండోమెంట్ ఆఫీసర్లు ప్రధాన పూజరులకు చెందిన 13 కుటుంబాల నుంచి వారి బ్యాంక్‍ అకౌంట్‍ వివరాలు ముందుగానే తీసుకున్నట్లు ఆ శాఖ డిప్యూటీ కమిషనర్‍ నర్సింహులు పేర్కొన్నారు. కానుకల పూర్తిస్థాయి లెక్కింపు అవగానే అందులోని పూజారుల వాటాను వారివారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు.

మరిన్ని వార్తల కోసం