
లక్నో: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న తాండవ్ వెబ్ సిరీస్ పై కేసు నమోదైంది. తాండవ్ సిరీస్ డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లతోపాటు అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ ఆఫ్ రీజనల్ కంటెంట్ పై ఉత్తర్ ప్రదేశ్, లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. తాండవ్ సిరీస్‌లో కొన్ని డైలాగులు, సీన్లు మతపరమైన అల్లర్లను సృష్టించేలా ఉన్నాయని.. హిందూ దేవుళ్లను చెడుగా చిత్రీకరించారంటూ ఎఫ్‌ఐఆర్‌లో పిటిషనర్ ఆరోపించారు.
అమెజాన్ ఇండియా ఒరిజినల్ కంటెంట్ హెడ్ అపర్ణా పురోహిత్, షో డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్, ప్రొడ్యూసర్ హిమాన్షు కృష్ణ మెహ్రాతోపాటు రచయిత గౌరవ్ సోలంకిపై సెక్షన్‌లు 153 ఏ, 259, 505 (1) (బీ) కింద కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన వ్యక్తి హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో సీనియర్ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తుండటం గమనార్హం. ఆయన పేరు అమర్‌నాథ్ యాదవ్.
సైఫ్ ఇంటికి భద్రత పెంపు
తాండవ్ సిరీస్‌లోని తొలి ఎపిసోడ్ 17వ నిమిషంలో హిందూ దేవుళ్ల పాత్రల సంభాషణలు అసభ్యకరంగా ఉన్నాయని.. అదే ఎపిసోడ్ 22వ నిమిషంలో కులపరమైన సెంటిమెంట్స్‌ను రెచ్చగొట్టేలా పాత్రల డైలాగ్స్ ఉన్నాయని ఫిర్యాదులో యాదవ్ ఆరోపించారు. కాగా, ఈ సిరీస్‌పై సోషల్ మీడియాలో ఎక్కువవడంతోపాటు విమర్శలు కూడా వస్తున్నాయి. బ్యాన్ తాండవ్ అంటూ ట్రోలింగ్స్, బాయ్ కాట్ సైఫ్ అంటూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా ముంబైలోని సైఫ్ ఇంటికి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తాండవ్ సిరీస్‌కు అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ వహించారు. లీడ్ రోల్‌లో సైఫ్ అలీ ఖాన్ నటించగా.. డింపుల్ కపాడియా, కృతికా కమ్రా, సునీల్ గ్రోవర్, కునాల్ గుప్తా, సారాహ్ జానే డియాస్‌లు కీలక పాత్రలు పోషించారు.