ఆరు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి.. అనాథగా మారిన కొడుకు

ఆరు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి.. అనాథగా మారిన కొడుకు

చొప్పదండి, వెలుగు : కరీంనగర్ ​జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంటలో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యభర్తల్లో భార్య ఆరు రోజుల కింద చనిపోగా, భర్త కూడా గురువారం కన్నుమూశాడు. దీంతో వారి కొడుకు అనాథగా మిగిలాడు. కొలిమికుంటకు చెందిన వికలాంగుడైన కొమ్ము రాజయ్య (40) కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇతడి భార్య కొమ్ము అనసూర్య(33) ఉపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఉండేది. వారికి12 ఏండ్ల కొడుకు నవదీప్ (12) ఉన్నాడు. 

రాజయ్య దివ్యాంగుడు కావడంతో ఇంటి దగ్గరే ఉంటూ పెన్షన్​తో కుటుంబాన్ని వెళ్లదీసేవాడు. అనసూర్య అనారోగ్యంతో ఉన్నా కూలి పనులకు వెళ్లేది. నవదీప్​ మోడల్ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్నాడు. అనారోగ్యంతో భార్యభర్తలు ట్రీట్​మెంట్ కోసం హాస్పిటల్స్​చుట్టూ తిరుగుతుండేవారు. అనసూర్యకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ రూ.లక్ష విలువైన ఆక్సిజన్​ సిలిండర్​ అందజేశారు.

 ఆమె ఆరోగ్యం విషమించడంతో గత శనివారం చనిపోయింది. భార్య మరణంతో భర్త రాజయ్య కుంగిపోయి మరింత అనారోగ్యానికి గురై గురువారం కన్నుమూశాడు. నిరుపేద కుటుంబం కావడంతో దహన సంస్కారాలను సర్పంచ్  తాళ్లపల్లి సుజాత శ్రీనివాస్​ గౌడ్  చేయించారు. అనాథగా మారిన నవదీప్​ను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని గ్రామస్తులు కోరుతున్నారు.