అనుమానంతో భార్యను చంపిండు..వికారాబాద్ జిల్లాలో ఘటన

అనుమానంతో భార్యను చంపిండు..వికారాబాద్ జిల్లాలో ఘటన

తాండూరు, వెలుగు: వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అల్లాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  

బిహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాకు చెందిన జీరో రిషి.. భార్య సరితాదేవి, కొడుకు రాజుతో కలిసి ఉపాధి కోసం తాండూరు ప్రాంతానికి వలస వచ్చాడు. అల్లాపూర్ గ్రామంలోని ఓ పాలిషింగ్ యూనిట్‌‌‌‌లో ఆరు నెలలుగా భార్యాభర్తలు కార్మికులుగా పనిచేస్తున్నారు. 

ఈ క్రమంలో సరితాదేవికి అదే ప్రాంతంలో పనిచేస్తున్న మరో కార్మికుడితో సాన్నిహిత్యం ఏర్పడిందని రిషి అనుమానించేవాడు. ఈ విషయమై దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. మంగళవారం రాత్రి మరోసారి వివాదం జరగడంతో ఆగ్రహించిన రిషి, బండరాయితో భార్యపై దాడి చేశాడు. 

అనంతరం తన యజమానికి ఫోన్ చేసి విషయం తెలిపాడు. తీవ్ర గాయాలతో ఉన్న సరితాదేవిని చికిత్స కోసం తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రిషిని అరెస్ట్ చేసి రిమాండ్ కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై వినోద్ రాథోడ్ తెలిపారు.