
సిద్దిపేట రూరల్, వెలుగు : అనారోగ్యంతో భర్త చనిపోగా.. అతడి మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో జరిగింది. చిన్నకోడూరు ఎస్సై సైఫ్ ఆలీ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొబ్బరిచెట్టు మహేందర్ (40), కావ్య (35) భార్యాభర్తలు.
వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మహేందర్ వారం కింద అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు సిద్దిపేటలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించగా... ట్రీట్‌మెంట్ తీసుకుంటూ గురువారం రాత్రి చనిపోయాడు.
మహేందర్ డెడ్‌బాడీని అదే రాత్రి గ్రామానికి తీసుకువచ్చారు. భర్త మరణాన్ని తట్టుకోలేక కావ్య గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేట పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శుక్రవారం చనిపోయింది. మృతురాలి తల్లి బాలవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.