 
                                    ఫస్ట్ నైట్ రోజునే భార్యను చంపిన ఘటన తమిళనాడులో జరిగింది. ఎంతోమంది పెళ్లంటే ఎన్నెన్నో ఊహించుకుంటారు. కొత్తకొత్త ఊహలతో, సరికొత్త ఆశలతో కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు. అప్పటివరకు పరిచయంలేని వ్యక్తిని తమ జీవిత భాగస్వామిగా కొత్త జీవితంలోకి ఆహ్వానిస్తారు. అలా కొత్త భాగస్వామితో కొత్త జీవితాన్ని ప్రారంభించే మొదటి రోజే హత్యకు గురయింది నవ వధువు. ఈ హత్య చేసింది మరేవరో కాదు వరుడే. తిరువళ్ళూరు జిల్లా పొన్నేరి సమీపంలోని సోమంజేరి గ్రామానికి చెందిన నివాసన్.. సాదనకుప్పంకు చెందని తమ సమీప బంధువు సంధ్యను బుధవారం ఉదయం పెళ్లి చేసుకున్నాడు. అతి కొంతమంది మాత్రమే హాజరైన ఈ వివాహం.. గుళ్లో సందడిగా జరిగింది. అయితే వివాహవేడుకల విషయంలో వధూవరులిద్దరూ ఆలయంలో గొడవపడ్డారు. ఆ గొడవే వారి జీవితాలు అంతంకావడానికి కారణమయింది. వధూవరులు, బంధువులు పెళ్లి తర్వాత ఎంతో ఆనందంగా ఇంటికొచ్చారు. బంధువులు ఫస్ట్ నైట్ కోసం గదిని అలంకరించి.. వధూవరులను గదిలోకి పంపించారు. అయితే గదిలో కూడా గుళ్లో జరిగిన గొడవ గురించి ప్రస్థావన వచ్చి ఇద్దరూ ఘర్షణ పడ్డారు. దాంతో కోపోద్రిక్తుడైన నివాసన్.. సంధ్యను చంపి పరారయ్యాడు. ఉదయం గదిలోనుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో బంధువులు తలుపులు తీసి చూడగా.. సంధ్య మృతిచెంది ఉంది. దాంతో బంధువలందరూ నివాసన్ కోసం ఊరంతా గాలించగా.. గ్రామ శివారున ఉన్న చెరువు గట్టున నివాసన్ ఉరేసుకొని కనిపించాడు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వధూవరుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పొన్నేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నారు.
For More News..

 
         
                     
                     
                    