బీహార్ కోవిడ్ ఆస్పత్రిలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. భర్త కరోనాతో ఆస్పత్రి బెడ్ మీద ఉంటే.. ఆమె చున్నీ పట్టి లాగాడు అక్కడే పనిచేసే అటెండర్. భర్త బెడ్ మీద దప్పట్లు మార్చమన్నందుకు.. సాయం చేస్తూ ఆమె నడుం మీద చేయివేశాడు. ఈ దుర్మార్గపు ఘటన భాగల్‌పూర్‌లోని గ్లోకల్ హాస్పిటల్‌లో జరిగింది. అంతేకాకుండా కరోనా వచ్చిందని తన భర్తను చేర్చుకోవడానికి మయగంజ్ మరియు పాట్నాలోని రెండు ఆస్పత్రులు నిరాకరించాయని బాధితురాలు తెలిపింది. ఈ మూడు ఆస్పత్రుల నిర్లక్ష్యం వల్లే తన భర్త చనిపోయాడని ఆమె ఆరోపించింది.
బీహార్‌కు చెందిన ఒక మహిళ తన భర్తతో కలిసి నోయిడాలో ఉంటున్నారు. వారిద్దరూ హోలీ సందర్భంగా బీహార్‌కు వచ్చారు. ఆ సమయంలో ఆమె భర్త అనారోగ్యం పాలయి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. దాంతో వారిద్దరూ కరోనా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారు. అందులో వారికి నెగిటివ్ వచ్చింది. కానీ ఎందుకైనా మంచిదని సిటి స్కాన్ చేయించుకోమని వైద్యులు సూచించారు. ఆ స్కాన్‌లో ఆమె భర్తకు 60 శాతం కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆమె తన భర్తను స్థానికంగా ఉన్న గ్లోకల్ ఆస్పత్రిలో చేర్పించింది. భర్తతో పాటు ఆమె తల్లికి కూడా కరోనా సోకడంతో ఆమెను కూడా అక్కడి ఐసీయూలో చేర్పించింది. అయితే అక్కడ వైద్యులు, అటెండర్లు నిమిషాల్లోనే వచ్చి వెళ్లిపోయేవారని.. ఏమాత్రం సరిగా పట్టించుకునేవారు కాదని ఆమె తెలిపింది. తన భర్త మంచినీళ్లు అడిగితే కూడా ఎవరూ ఇవ్వలేదని ఆమె ఆరోపించింది.
‘గ్లోకల్ ఆస్పత్రిలో జ్యోతి కుమార్ అనే ఒక అటెండర్ ఉన్నాడు. నేను నా భర్తకు కొత్త బెడ్‌షీట్లు మార్చాడానికి సాయం చేయమని అడిగాను. అతను సరే అని బెడ్‌షీట్లు తీసుకొచ్చాడు. అయితే బెడ్‌షీట్లు మారుస్తూ నేను నా భర్తతో మాట్లాడుతున్నప్పుడు.. అటెండర్ నా వెనకనుంచి నా దుపట్టా లాగాడు. నేను వెంటనే వెనుకకు తిరిగేసరికి.. అతను నా నడుము మీద చేయి వేస్తూ నవ్వుతున్నాడు. వెంటనే నేను నా చున్నీని వెనక్కి లాక్కున్నాను. నాకు చాలా భయమేసింది. ఏదైనా అందామంటే నా భర్త, తల్లి అక్కడ చికిత్స పొందుతున్నారు. ఏమైనా అంటే వారికి ఏదైనా హాని తలపెడతారని నేను అటెండర్‌ను ఏమీ అనలేదు’ అని బాధిత మహిళ తెలిపింది.
అదేవిధంగా మయగంజ్ మరియు పాట్నా ఆస్పత్రులలో కూడా తనకు ఎదురైనా అనుభవాల గురించి కూడా బాధితురాలు తెలిపింది. భాగల్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నైట్ షిఫ్టులో ఉన్న వైద్యులు తన భర్తను పరీక్షించడానికి గానీ లేదా అతనికి ఆక్సిజన్ ఇవ్వడానికి కూడా నిరాకరించారని ఆమె పేర్కొన్నారు.
అదే తరహాలో పాట్నాలోని రాజేశ్వర్ ఆసుపత్రిలో తన భర్తకు ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయినప్పుడు సిబ్బంది నిర్లక్ష్యం చేశారని ఆమె ఆరోపించారు. ఎంతో బతిమిలాడితే కానీ ఆక్సిజన్ పెట్టలేదని ఆమె అన్నారు. అయితే తన భర్త ఆక్సిజన్ లెవల్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత.. సిబ్బంది ఆక్సిజన్ సప్లై ఆపేశారని ఆమె తెలిపింది. దాంతో ఆమె బ్లాక్ మార్కెట్ నుంచి సిలిండర్లను కొనుగోలు చేసి.. ఆస్పత్రికి తీసుకొచ్చి తన భర్తకు ఆక్సిజన్ పెట్టినట్లు ఆమె చెప్పింది.
బాధితురాలు చేసిన ఆరోపణలపై భాగల్‌పూర్ అధికారులు విచారణ చేపట్టారు. పేషంట్ భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన అటెండర్‌ను గ్లోకల్ హాస్పిటల్ సస్పెండ్ చేసింది.
