భార్యను చంపిన భర్తకు ఏడేళ్ల జైలు

భార్యను చంపిన భర్తకు ఏడేళ్ల జైలు

కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లిలో భార్యను చంపిన ఓ భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎం. అర్చన కుమారి బుధవారం తీర్పు వెల్లడించారు. కోర్టు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... 2025 ఫిబ్రవరి 20న మధ్యప్రదేశ్ రాష్ట్రం దిండోరి ప్రాంతానికి చెందిన కమలేష్ మరావి అతని భార్య పింకీ మాధవి మిర్చికోత పనుల కోసం కారేపల్లి మండలానికి వచ్చారు. 

లక్ష్మీపురం, జైత్రం తండా గ్రామాల సమీపంలో గుడారాలు వేసుకుని తోటి కూలీలతో కలిసి ఉండేవారు. వంట చేసే విషయంపై ఉదయాన్నే భార్యాభర్తలు గొడవపడ్డారు. విచక్షణ కోల్పోయిన భర్త కమలేష్ భార్యను విపరీతంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో నివేదిక అందించారు. నేరం రుజువు కావడంతో శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు.