హుస్నాబాద్ మున్సి పాలి టీలో మెప్మా ఆఫీసర్ ఓవరాక్షన్

హుస్నాబాద్ మున్సి పాలి టీలో మెప్మా ఆఫీసర్ ఓవరాక్షన్
  • హుస్నాబాద్ మహిళా సంఘాల సభ్యుల ఆగ్రహం
  •     చైర్​పర్సన్, వైస్ చైర్​పర్సన్లకు ఫిర్యాదు

హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఏడీఎమ్​సీ ఆఫీసర్​(అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్) సంతోషి మాత తీరు వివాదాస్పదంగా మారింది. పొదుపు చేసుకున్న పైసలు డ్రా చేసేందుకు ఆమె పెడుతున్న కొత్త రూల్స్​తో మహిళా సంఘాల సభ్యులు చుక్కలు చూస్తున్నారు. అధికారి అరాచకాలు భరించలేక మహిళా సంఘాల ప్రతినిధులు గురువారం మున్సిపల్ చైర్​పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్​పర్సన్ చిత్తారి పద్మను కలిసి మొరపెట్టుకున్నారు. గతంలో పనిచేసిన ఆఫీసర్ల హయాంలో లేని కొత్త నిబంధనలను ఆమె తీసుకువచ్చారని ఆరోపిస్తున్నారు.

తాను చెప్పిందే వినాలి అని బ్యాంక్ అధికారులకు కూడా హుకుం జారీ చేసిందని పేర్కొన్నారు. సంతకం కోసం ఆఫీసుకు వెళ్తే ఆమె సీట్లో ఉండరని, ఎప్పుడు వస్తారో తెలియక మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేయలేక చస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైనా అడిగితే ఫైళ్లను మొహం మీద విసిరేస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సదరు అధికారి గతంలో సిద్దిపేట, చేర్యాల మున్సిపాలిటీల్లో పనిచేసినప్పుడు ఇలాగే వ్యవహరించినట్లు సమాచారం.

అప్పట్లో అక్కడి ఆర్పీలు కలెక్టర్​కు ఫిర్యాదు చేయడంతో ఆమెను బదిలీ చేశారు. హుస్నాబాద్ వచ్చినా ఆమె తీరులో మార్పు రాలేదని, ఒంటెద్దు పోకడతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘాలకు రావాల్సిన వడ్డీ లేని రుణాల విషయంలోనూ సంతోషిమాత అడ్డంకులు సృష్టిస్తున్నారని, లోన్లను రిటర్న్ పంపిస్తున్నారని, సంతకాల కోసం పైసలు వసూలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బ్యాంక్ లింకేజీ లోన్లు, స్త్రీ నిధి డేటా ఎంట్రీ, డెత్ క్లెయిమ్స్, చివరకు స్ట్రీట్ వెండర్ లోన్లు కావాలన్నా డబ్బులు అడుగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి, విచారణ జరిపి అధికారిపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.