నిండుకుండలా హుస్సేన్ సాగర్.. 513.20 మీటర్లకు చేరుకున్న నీటి మట్టం

నిండుకుండలా హుస్సేన్ సాగర్..  513.20 మీటర్లకు చేరుకున్న నీటి మట్టం
  • ఇన్ ఫ్లో 1,167.. అవుట్​ఫ్లో 778 క్యూసెక్కులు
  • ఉస్మాన్​సాగర్​లో 1,782 .80, 
  •  హిమాయత్​సాగర్​లో 1,761.20 అడుగుల నీళ్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు : హుస్సేన్ సాగర్ కు వరద ప్రవాహం పెరిగింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, ముసురుకు నిండుకుండలా మారింది. బంజారా, పికెట్, కూకట్ పల్లి, బుల్కాపూర్ నాలాల నుంచి భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతున్నది. సాగర్ ఎఫ్ టీఎల్​లెవెల్ 513.41 మీటర్లు కాగా..రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు నీటిమట్టం 513.20 మీటర్లకు చేరుకుంది. దీంతో వచ్చిన నీటిని తూముల ద్వారా మూసీలోకి వదులుతున్నారు. ఈ వరద అశోక్ నగర్, దోమలగూడ, అంబర్​పేట, గోల్నాక ద్వారా మూసీలో కలుస్తోంది. 

కాగా, శుక్రవారం రాత్రి వరకు ఇన్​ఫ్లో 1,167 క్యూసెక్కులు ఉండగా, 778 క్యూసెక్కుల అవుట్​ఫ్లో నమోదవుతున్నది. దీంతో ఎఫ్టీఎల్​దాటకుండా వాటర్ లెవెల్ ను మెయింటెన్​ చేస్తున్నారు. వరద పరిస్థితిని జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం అధికారులు 24 గంటలపాటు పరిశీలిస్తున్నారు. వర్షాలు మరింత ఎక్కువైతే లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరికలు జారీ చేసే అవకాశముంది.  2022లో భారీ వర్షాల కారణంగా హుస్సేన్​సాగర్​నీటి మట్టం 513.43కి చేరుకోగా, 2023 సెప్టెంబర్5న 513.41 కి చేరింది. అలాగే, 2024లో గరిష్టంగా 513.60 అడుగులకు వచ్చింది. 

జంట జలాశయాలు ఇలా.. 

శుక్రవారం ముసురుతో జంట జలాశయాల్లోకి పెద్దగా నీరు చేరలేదు. దీంతో ప్రస్తుతం నీటి నిల్వలు నిలకడగా ఉన్నాయి. ఉస్మాన్​సాగర్​పూర్తి స్థాయి కెపాసిటీ 1,790 అడుగులు(3.900 టీఎంసీ) కాగా, ప్రస్తుతం1,782.80 అడుగుల (2.474 టీఎంసీ) నీళ్లున్నాయి. ఇన్​ఫ్లో పూర్తిగా ఆగిపోయింది. ఇక హిమాయత్​సాగర్​నిల్వసామర్థ్యం 1,763.50 అడుగులు(2.970 టీఎంసీ)కాగా, ప్రస్తుతం1,761.20 అడుగుల(2.471 టీఎంసీ)నీళ్లు చేరాయి. ఇన్​ఫ్లో 250 క్యూసెక్కులుగా ఉంది.