
- ఈటల, బండి అనుచరుల పోటాపోటీ సమావేశాలు
- హుజూరాబాద్‌పై ఫోకస్ పెంచిన కేంద్రమంత్రి బండి సంజయ్
- వ్యక్తుల పేరుతో గ్రూపులు కడితే టికెట్లు ఇవ్వబోమని హెచ్చరిక
- ఎంపీ ఈటల హుజూరాబాద్ వైపు రాకపోవడంతో అయోమయంలో అనుచరులు
- తమదారి తాము చూసుకునేందుకు కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు
- బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గౌతం రెడ్డి రాజీనామా.. అదే బాటలో మరికొందరు..
కరీంనగర్, వెలుగు : హుజూరాబాద్ బీజేపీలో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ పోరు.. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటనతో మరింత రాజుకున్నాయి. పార్టీ టికెట్లు, పార్టీలో గ్రూపులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈటల రాజేందర్ అనుచరులను రాజకీయంగా అభద్రతాభావంలోకి నెట్టాయి.
ఇప్పటికే పాత బీజేపీ, కొత్త బీజేపీ (ఈటల వర్గం)గా ఉన్న నాయకులు, కార్యకర్తలు రెండు రోజులుగా వేర్వేరుగా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్‌పై కార్యకర్తలతో చర్చిస్తున్నారు. ఈటల రాజేందర్ అనుచరుడిగా పేరున్న మాడ గౌతంరెడ్డి బీజేపీలో ఇమడలేక ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పదవికి గురువారం రాజీనామా చేయగా.. ఆయన బాటలోనే మరికొందరు రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
సంచలనం రేపిన బండి కామెంట్స్
హుజూరాబాద్‌లో టెన్త్ స్టూడెంట్లకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు వెళ్లిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ మీడియాతో చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో తనకు తక్కువ ఓట్లు రావాలని హుజూరాబాద్‌లో కొందరు పని చేశారని, అలాంటోళ్లకు టికెట్లు ఇవ్వమంటారా ? అని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. ‘ఇప్పటికైనా అటు ఇటు ఉండకుండా పార్టీ జెండా కిందికి రావాలి..
నాకోసమే పని చేసేటోళ్లుగానీ, ఇంకొకరి కోసం పని చేసేటోళ్లుగానీ పార్టీ జెండా కిందికి రావాలి’ అని ఆయన చేసిన కామెంట్స్ ఈటల వర్గీయులను ఉద్దేశించినవేనన్న ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ మాట్లాడిన కొన్ని గంటల్లోనే ఈటల అనుచురుడు మాడ గౌతంరెడ్డి తన పార్టీ పదవికి రాజీనామా చేయడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
పోటాపోటీ సమావేశాలు
కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటనకు ముందే అలర్ట్ అయిన ఈటల రాజేందర్ వర్గీయులు ఎక్కడికక్కడ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ నెల 15న కమలాపూర్‌లో, 16న ఇల్లందకుంటలో సమావేశం నిర్వహించగా.. మాడ గౌతంరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వీణవంకలో ఈటల అనుచరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఈటల మనుషులుగా ముద్రపడిన వాళ్లకు మండల అధ్యక్షులు, బూత్ కమిటీల్లాంటి చిన్న పదవులు కూడా ఇవ్వడం లేదని, ఈటల రాజేందర్‌ను అణచివేయాలన్న ధోరణితోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
హుజూరాబాద్‌లోనూ ఈటల అనుచరులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఓ వైపు ఈటల అనుచరుల సమావేశాలు జరుగుతుండగానే.. మరో వైపు శుక్రవారం సాయంత్రం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్యనాయకులతో జమ్మికుంట శిశుమందిర్‌లో సమావేశం నిర్వహించారు. వ్యక్తి పూజ, గ్రూపులు బీజేపీలో ఉండవని, ప్రతిఒక్కరూ పార్టీ కోసమే, పార్టీ జెండా కిందే పనిచేయాలని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
ఈటలపై అనుచరుల నారాజ్
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఆ పార్టీని వీడి 2021 ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున తలపడడంతో హుజూరాబాద్ నియోజకవర్గం పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది. అప్పట్లో ఆయన అనుచరులు బీజేపీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి ఈటల హుజూరాబాద్, గజ్వేల్‌లో రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోనే హుజూరాబాద్ ప్రచార బాధ్యతలు తన భార్య జమునకు అప్పగించి.. గజ్వేల్ మీదే ఆయన ఫోకస్ చేశారు. కానీ రెండు చోట్లా ఓడిపోయారు.
నమ్ముకున్న కేడర్‌ను వదిలి వేరే నియోజకవర్గానికి వెళ్లడంతో ఈటల తీరుపై ఆయన అనుచరులు ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన తర్వాత హుజూరాబాద్‌ను పూర్తిగా వదిలేశారన్న విమర్శ ఈటలపై ఉంది. దశాబ్దాలుగా ఆయన వెంట తిరిగి, ఆయన మనుషులుగా ముద్రపడిన స్థానిక నాయకులు ఈటల తీరుపై నారాజ్‌గా ఉన్నట్లు తెలిసింది. ఇదే విషయమై తాడోపేడో తేల్చుకునేందుకు ఒకటి, రెండు రోజుల్లో శామీర్‌పేటలోని ఈటల ఇంటికి వెళ్లాలని తాజాగా నిర్వహిస్తున్న సమావేశాల్లో నిర్ణయించినట్లు తెలిసింది.