ఈవీఎంల తరలింపుపై రిటర్నింగ్ అధికారి క్లారిటీ..!

ఈవీఎంల తరలింపుపై రిటర్నింగ్ అధికారి క్లారిటీ..!

హుజూరాబాద్ బైపోల్ కు సంబంధించిన వీవీ ప్యాట్ ను ఎస్కార్ట్ లేకుండా తరలించారని ఆరోపిస్తున్నారు బీజేపీ, కాంగ్రెస్ నేతలు. దీనిపై ఆందోళనకు దిగారు. పోలీస్ పహారా లేకుండా, అధికారుల పర్యవేక్షణ లేకుండా వివి ప్యాట్ లు ఎలా తరలిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేతలు. అర్ధరాత్రి సమయంలో SRR  డిగ్రీ కాలేజీ దగ్గర EVM లను కారులో తరలిస్తున్నారంటూ అడ్డుకున్నారు BJP కార్యకర్తలు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ SRR డిగ్రీ కాలేజీ దగ్గర అధికారులను నిలదీశారు. 

హుజురాబాద్ లో మొరాయించిన VV ప్యాట్ ఒకటి బస్సులో ఉండటంతో.. కారులో తీసుకురమ్మని అధికారులు చెప్పటంతో తీసుకెళ్తున్నామని వివరణ ఇచ్చాడు కారు డ్రైవర్. అన్ని  బస్సుల్లాగా నేరుగా కాలేజీలోకి తీసుకెళ్లకుండా.. వీవీ ప్యాట్ ను కారులోకి ఎందుకు మార్చారని ప్రశ్నించారు BJP కార్యకర్తలు. అధికారుల తీరుపై నిరసనగా కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, ఇతర బీజేపీ నేతలు ఆందోళన చేశారు.  పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పోలీస్ పహారా లేకుండా, అధికారుల పర్యవేక్షణ లేకుండా వీవీ ప్యాట్ లు ఎలా తరలిస్తారని నిలదీశారు బీజేపీ కార్యకర్తలు. కలెక్టర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 

దీనిపై ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.. రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు పనిచేయని వివి ప్యాట్ ను.. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ కళాశాల రోడ్డు ఎదురుగా ఉన్న రిసెప్షన్ సెంటర్ నుండి.. ఒక అధికారిక వాహనం నుంచి మరో అధికారిక వాహనంలో మార్చి గోదాంకు తీసుకువెళ్లారని తెలిపారు. దీన్ని కొందరు అనుమానంతో వీడియో తీసి వైరల్ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దన్నారు.. హుజురాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి.