హుజూరాబాద్ బైపోల్: కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

హుజూరాబాద్ బైపోల్: కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
  • భూపాలపల్లి సభలో ప్రకటన

హైదరాబాద్, వెలుగు: హుజూరాబాద్​ ఉప ఎన్నిక షెడ్యూల్​రావడంతో రాష్ట్ర కాంగ్రెస్​లో హడావుడి మొదలైంది. అభ్యర్థిని రెండు రోజుల్లో ప్రకటించేందుకు నిర్ణయం జరిగింది. 30న భూపాలపల్లిలో జరిగే సభలో పేరు ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది. భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ నేతృత్యంలోని కమిటీ కొద్ది రోజుల క్రితమే నాలుగు పేర్లను హైకమాండ్ పరిశీలనకు పంపింది. బయోడేటా, బలాబలాల వివరాలతో నివేదిక ఇచ్చింది. కవ్వంపల్లి సత్యనారాయణ (ఎస్సీ-మాదిగ), కొండా సురేఖ (బీసీ -పద్మశాలి), పత్తి కృష్ణారెడ్డి (రెడ్డి), ప్యాట రమేశ్ (బీసీ -మున్నూరు కాపు) పేర్లను పంపినట్లు సమాచారం. భూపాలపల్లిలో పట్టున్న నేత గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్​లో చేరుతున్న సందర్భంగా 30న భారీ సభ జరగనుంది. అభ్యర్థి ప్రకటనకు దాన్ని సరైన వేదికగా భావిస్తున్నామని కాంగ్రెస్​ ముఖ్య నేత ఒకరు చెప్పారు.
బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు జోరుగా ప్రచారం చేసుకుంటున్నా కాంగ్రెస్ అభ్యర్థినే తేల్చకపోవడంపై పార్టీలోనే విమర్శలొచ్చాయి. కాంగ్రెస్​కు అభ్యర్థే లేడంటూ బీజేపీ, టీఆర్ఎస్​ఒక దశలో ఎద్దేవా చేశాయి. రేవంత్​రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక వస్తున్న తొలి ఎన్నిక కావడంతో బలమైన అభ్యర్థి కోసం కసరత్తు జరిగింది. హుజూరాబాద్ లోని గట్టి కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్​కు మారడంతో అభ్యర్థి ఎంపిక పరీక్షగా మారింది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ పేరు పరిశీలనకు వచ్చినా పోటీకి ఆయన ఆసక్తి చూపలేదు.

కరీంనగర్​ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక నేత పత్తి కృష్ణారెడ్డి పేర్లు తెర మీదకు వచ్చాయి. కానీ ఇంకా బలమైన నేతను దింపాలని రేవంత్​వర్గం భావించడంతో కొండా సురేఖ పేరు తెర మీదికొచ్చింది. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన వర్గానికి మూడు టికెట్లివ్వాలని ఆమె షరతులు పెట్టినట్టు వార్తలొచ్చాయి. దాంతో, అసలు పక్క జిల్లా నుంచి ఆమెను ఎందుకు తేవాలన్న అభిప్రాయం కరీంనగర్​నేతల్లో వ్యక్తమైంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలో కరీంనగర్​లో జరిగిన సమీక్షలో లోకల్​లీడర్లు కొండా అభ్యర్థిత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. దాంతో అభ్యర్థి ఎంపికకు కమిటీ వేయగా 19 మంది దరఖాస్తు పెట్టుకున్నారు.