పెండ్లి కొడుకు మోసం చేసిండని పెళ్లి అడ్డుకున్న యువతి

పెండ్లి కొడుకు మోసం చేసిండని పెళ్లి అడ్డుకున్న యువతి

మందమర్రి, వెలుగు: పెండ్లికొడుకు తనను మోసం చేశాడంటూ మరో యువతి పీటల మీద పెండ్లిని అడ్డుకుంది. మంచిర్యాల జిల్లా క్యాతన్​పల్లి మున్సిపాలిటీ అమ్మాగార్డెన్స్(ఆర్కేపీ  రాంనగర్​)కు చెందిన బొద్దుల శ్రీనివాస్,​ పద్మ  దంపతుల కొడుకు రాజేశ్ ​పెండ్లి గోదావరిఖనికి చెందిన  యువతితో నిశ్చయించారు. మందమర్రి మండలం గద్దెరాగడిలోని భీమా గార్డెన్స్​లో బుధవారం ఉదయం 10 గంటలకు పెండ్లి జరుగుతుండగా తాళి కట్టే సమయంలో కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ ​సమీపంలోని అగ్రహారం గ్రామానికి చెందిన గోర్ల రమీనా అడ్డుకుంది. తనను ప్రేమించి మరొకరిని ఎలా పెండ్లి చేసుకుంటున్నావంటూ పీటలపైకి వెళ్లి నిలదీసింది. అవాక్కయిన కుటుంబసభ్యులు తేరుకొని పెండ్లిని అడ్డుకున్న యువతిని చితకబాదారు. ఆమె వద్ద ఉన్న సెల్​ఫోన్ ​లాక్కొని ఫంక్షన్​హాల్​ నుంచి బయటకు పంపించారు. ఈ  గందరగోళ పరిస్థితుల్లో పెండ్లికొడుకు తల్లిదండ్రులు స్పృహ కోల్పోవడంతో బంధువులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.

పెళ్లి అడ్డుకోవడానికి ముందే యువతి 100కు డయల్ ​చేసి స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. మరో యువతి వచ్చి పెళ్లి అడ్డుకోవడంతో పెళ్లికూతురు బంధువులు పెండ్లికొడుకు రాజేశ్​ను ​ నిలదీశారు. ఓ దశలో  దాడికి  ప్రయత్నించగా అప్పటికే అక్కడికి చేరుకున్న రామకృష్ణాపూర్​పట్టణ ఎస్సై అశోక్, పోలీసులు సర్దిచెప్పారు. ఇరుకుటుంబాల మధ్య రాజీ చేసేందుకు టీఆర్ఎస్​ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, లీడర్లు ప్రయ్నతించగా పెండ్లికూతురు కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. సాయంత్రం  అమ్మా గార్డెన్​లోని పెండ్లికొడుకు ఇంటి ఎదుట పెండ్లికూతురు కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు.  రాజేశ్​పై రమీనా రామకృష్ణాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో తన బావతో పెండ్లి జరిగితే విడాకులు తీసుకున్నట్లు పేర్కొంది. రాజేశ్​ హైదరాబాద్​లో ఎలక్ట్రికల్ ​ఇంజనీర్​గా పని చేస్తున్నాడని, హనుమకొండలో తాను ఫార్మసీ చేస్తున్న టైమ్​లో పరిచయమయ్యాడని తెలిపింది. నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది. మరో యువతితో పెండ్లి కుదుర్చుకున్న విషయం తనకు తెలియదని, మంగళవారం రాత్రి కూడా తనతో రాజేశ్​ ఫోన్​లో చాటింగ్​ చేశాడని చెప్పింది. అతడికి మరో యువతితో పెండ్లి  జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే వచ్చి అడ్డుకున్నట్లు తెలిపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.