పొలిటికల్ హీట్ షురూ: హుజూర్ నగర్ ఉపఎన్నిక డేట్ ఫిక్స్

పొలిటికల్ హీట్ షురూ: హుజూర్ నగర్ ఉపఎన్నిక డేట్ ఫిక్స్

కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజులుగా హీట్ రేపుతున్న హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక డేట్ ఫిక్స్ అయింది. వచ్చే నెల 21న ఓటింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఆయన ప్రకటించారు. ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఆ రోజు నుంచి అక్టోబరు 4 వరకు నామినేషన్ల స్వీకరణ చేపడుతామని చెప్పారు. అక్టోబరు 21 పోలింగ్, 24న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రటిస్తామన్నారు.

64 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు

దేశవ్యాప్తంగా ఖాళీ ఉన్న 64 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని సునీల్ అరోరా తెలిపారు. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, ఛత్తీస్ గఢ్, అసోం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పాండిచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన స్థానాలకు మహారాష్ట్ర, హర్యానాలతో పాటే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ ఉప ఎన్నికకు సెప్టెంబర్‌ 23న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. ఉపసంహరణ అక్టోబర్ 3. ఇక పోలింగ్‌ ప్రక్రియ అక్టోబర్‌ 21న, ఓట్ల లెక్కింపు 24న నిర్వహించనున్నారు.

ఇప్పటికే హుజూర్ నగర్ లో హీట్

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసి ఉత్తమ్ విజయం సాధించారు. దీంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా కొనసాగుతున్నారాయన. అయితే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజూర్ నగర్ నుంచి తన భార్య పద్మావతి రెడ్డిని పోటీ చేయించాలని భావించారు. ఆమే అభ్యర్థి అని కూడా కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు.

ఆయన ప్రకటనే  కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలను రాజేసింది. ఎవరినీ సంప్రదించకుండా ఉత్తమ్ అభ్యర్థిని ఎలా డిసైడ్ చేస్తారంటూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన అభ్యర్థి కిరణ్ రెడ్డి అంటూ ఆయన ప్రకటించేశారు. దీంతో కాంగ్రెస్ రెండుగా చీలి కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. టీవీ డిబేట్లలోనూ రెండు వేర్వేరు వాదనలతో పార్టీ పరువు పోతుండడంతో అధికార ప్రతినిధులను కొద్ది రోజులు టీవీ చానెల్ చర్చలకు పంపకూడదని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది.

త్రిముఖ పోటీ

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొంటుంది. రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ఈ సీటును సొంతం చేసుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్, తమ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి బలం ఉందని నిరూపించుకోవడానికి టీఆర్ఎస్ అన్ని శక్తులనూ ఒడ్డుతాయి.