- స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్ చొరవతో పనులు స్పీడప్
- అర్హులైన పేదల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ షురూ
- ఫిబ్రవరి నాటికి లబ్ధిదారుల ఎంపికకు అధికారుల కసరత్తు
సూర్యాపేట/హుజూర్ నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లాలో నిర్మించే మోడల్ కాలనీలో పేదల సొంతింటి కల ఉగాదికి నెరవేరనుంది. హుజూర్ నగర్ శివారులోని రామస్వామి గుట్ట వద్ద మోడల్ కాలనీ పనులు చివరి దశకు చేరాయి. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అధికారులు చేపట్టారు. ఉమ్మడి ఏపీలో 2014 జనవరిలో రూ.98.51 కోట్లతో అప్పటి గృహ నిర్మాణ శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మోడల్ కాలనీగా 2,160 సింగిల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
దాదాపు 60 శాతం పను లు పూర్తి చేశారు. దేవాదాయ శాఖ భూమిని హైకోర్టు అనుమతి ద్వారా రెవెన్యూ శాఖతో కొనుగోలు చేయించి మోడల్ కాలనీ నిర్మాణానికి మంత్రి కృషి చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ వచ్చాక పనుల పూర్తిపై నిర్లక్ష్యం చేసింది. మోడల్ కాలనీని కాస్త డంప్ యార్డ్ గా మార్చే సింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వచ్చాక రూ.74.80 కోట్ల మంజూరు చేయగా.. వెంటనే పనులు ప్రారంభించారు. వచ్చే మార్చిలోపు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్యలు చేపట్టారు.
135 బ్లాకులు..జీ ప్లన్ వన్ నిర్మాణాలు
మోడల్ కాలనీలో అన్ని సదుపాయాలను కల్పిస్తూ నిర్మాణాలు చేస్తున్నారు. ప్రణాళిక మేరకు అభివృద్ధి, ఆధునిక వసతులతో తీర్చిదిద్దుతున్నారు. 2014, 2024 లో విడుదల చేసిన రూ.173.31 కోట్లతో జి ప్లస్ వన్ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టారు. ఇందులో135 బ్లాకులు ఉండగా ప్రతి బ్లాక్ లో 16 చొప్పున మొత్తం 2,160 ఇండ్లను నిర్మించారు. ప్రతి ఫ్లాట్ లో అవసరాల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించారు. అన్ని బ్లాకులను కలుపుతూ రోడ్లు.. వీటిని అనుసంధానిస్తూ మెయిన్ రోడ్డును వేశారు. ఆధునిక వసతులతో ఆదర్శ మోడల్ కాలనీగా నిలిపేందుకు మంత్రి ఉత్తమ్, అధికారులు కృషి చేస్తున్నారు.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ షురూ
వచ్చే మార్చిలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి వెంటనే పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారు. రెండు రోజుల కింద మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇండ్ల నిర్మాణాలను పరిశీలిం చారు. వెంటనే అర్హుల ఎంపిక చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఫిబ్రవరి చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి, ఉగాదికి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించేలా ప్లాన్ ను చేయాలని ఆఫీసర్లకు సూచించారు.
పేదల సొంతింటి కల తీర్చడమే లక్ష్యం
నా నియోజకవర్గంలోని పేదలకు సొంతింటి కల తీర్చడమే లక్ష్యం. గతంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు , ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఇండ్లు పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నాను. అర్హులైన పేదలకు ఇండ్లు ఇస్తాం. దళారులకు, మధ్యవర్తులకు, సిఫారసులు, రాజకీయ ఒత్తిడులకు తావు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించాను. పారదర్శకంగా ఎంపిక జరుగుతుంది. అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ ఇండ్లు ఇచ్చేలా కృషి చేస్తాను. - మంత్రి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి
