అగ్రికల్చర్ కాలేజీ పనులు ఇక స్పీడప్

అగ్రికల్చర్ కాలేజీ పనులు ఇక స్పీడప్
  • చివరి దశకు భూసేకరణ పనులు 
  • హుజర్ నగర్ లో కాలేజీకి 100 ఎకరాల కేటాయింపు
  • భూసేకరణ పూర్తి చేసి త్వరలో రైతులకు పరిహారం చెల్లింపు 
  • రూ.120 కోట్లతో భవన నిర్మాణాలు
  • రెండో  సెమిస్టర్ ప్రారంభానికి ఏర్పాట్లు

సూర్యాపేట/హుజూర్ నగర్, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అభివృద్ధికి మైలురాయిలా నిలిచే అగ్రికల్చరల్ కాలేజ్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. హుజూర్ నగర్ లో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని గత సంవత్సరం ఉగాది నాడు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో ఒకేసారి 5 జీవోలను విడుదల విడుదల చేశారు.  ఈ క్రమంలో కాలేజీ ఏర్పాటుకు అనుమతులు, స్థల సేకరణ, పరిహారం అందించడం, కౌన్సిలింగ్ లో సీట్ల కేటాయింపు క్లాసుల నిర్వహణకు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టగా అగ్రికల్చర్ కాలేజీ కోసం చేపట్టిన భూసేకరణ చివరి దశకు చేరింది. 

100 ఎకరాల స్థల సేకరణ 

సూర్యాపేట జిల్లాహుజూర్ నగర్ నుంచి మట్టపల్లి కి వెళ్లే రహదారిలోని 1041 సర్వే నెంబర్ మగ్దూంనగర్ వద్ద అగ్రికల్చర్ కాలేజీ నిర్మించేందుకు 100 ఎకరాల స్థల సేకరణ చేయనున్నారు. ఇప్పటికే భూ సర్వే పూర్తయింది. ప్రభుత్వం ఎకరానికి రూ. 22 లక్షలు చెల్లించేందుకు సిద్దంగా ఉండగా రైతులు మాత్రం ఎకరాకురూ.25 లక్షలు చెల్లించాలన్న డిమాండ్ చేస్తుండడంతో కొంత జాప్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని రైతులను ఒప్పిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో రైతులకు పరిహారం చెల్లించి రైతుల వద్ద నుంచి భూములు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది.

రూ.124  కోట్ల నిధులు మంజూరు

అగ్రికల్చర్  కాలేజ్‌‌‌‌‌‌‌‌ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.124 కోట్ల నిధులను మంజూరు చేసింది. తొలుత మొదట రెండు సంవత్సరాలు ప్రైవేటు భవనంలో క్లాసులు నిర్వహిస్తూ నిర్మాణ పనులను చేపట్టనున్నారు.  కాలేజీ చుట్టూ ప్రహరీ గోడ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, క్లాసుల నిర్వహణ, ల్యాబ్ లు, హాస్టల్ తదితర భవనాలన్నింటిని ఒక్కొక్కటి నిర్మించనున్నారు. ప్రధానమైన భవనాలన్నింటిని 2 సంవత్సరాల్లో నిర్మించి తరగతులు ఆ భవనాల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

54 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అనుమతి

అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన ఎస్టాబ్లిష్మెంట్ అగ్రికల్చరల్ కో ఆపరేషన్ డిపార్ట్ మెంట్ హుజూర్ నగర్ అగ్రికల్చరల్ కాలేజ్ కోసం 54 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు ఎంపిక చేసుకునేందుకు అనుమతినిచ్చింది.  ఇందులో  టీచింగ్-41 పోస్టులకు  అసోసియేట్ డీన్  ప్రొఫెసర్-01, ప్రొఫెసర్స్-3,అసోసియేట్ ప్రొఫెసర్స్-11,అసిస్టెంట్ ప్రొఫెసర్స్- 26,నాన్ టీచింగ్ విభాగంలో 13,  మెడికల్ ఆఫీసర్-1,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్1, ఫామ్ మేనేజర్ లేదా అగ్రికల్చరల్ ఆఫీసర్ -1, సూపరింటెండెంట్-1, సీనియర్ అసిస్టెంట్ -4, కేర్ టేకర్-2, సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్1,స్టోర్ కీపర్-2 పోస్టులకు అనుమతి ఇచ్చింది.

34  మంది విద్యార్థుల కేటాయింపు

ఈ విద్యా సంవత్సరంలోనే కాలేజీకి 34 మంది విద్యార్థులను కౌన్సిలింగ్ లో కేటాయించారు. వారికి ప్రస్తుతం రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ కాలేజీలో తరగతులు నిర్వహిస్తున్నారు. రానున్న రెండో సెమిస్టర్ మార్చి లేదా ఏప్రిల్ లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అద్దె భవనం తీసుకొని తరగతులు నిర్వహించేందుకు అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య, ప్రిన్సిపాల్ అనిల్ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

అగ్రికల్చరల్ కాలేజ్ లో అన్ని  విభాగాలు

అగ్రికల్చర్ కాలేజీలో కేవలం విద్యార్థులకు వ్యవసాయ పద్ధతుల బోధన మాత్రమే కాకుండా కాలేజీ పరిధిలో క్రాప్ సైన్స్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్, సాయిల్ సైన్స్, అగ్రో మెట్రోలజీ, వ్యవసాయ యంత్రాలు,సాగునీటి వ్యవస్థలు, అగ్రికల్చరల్ టెక్నాలజీస్, పంటల నిల్వ ప్రాసెసింగ్ తదితర అంశాలకు సంబంధించిన విభాగాలు ఉంటాయి. రైతులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. - ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్  ఆల్దాస్ జానయ్య

రైతుల అభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది

హుజూర్ నగర్ ప్రాంత రైతుల అభివృద్ధి భవిష్యత్తుకు అగ్రికల్చరల్ కాలేజీ ఏర్పాటు పునాది అవుతుంది. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు సాయిల్స్, సీడ్స్, ఫార్మింగ్, ప్రాసెసింగ్ లాంటి సాంకేతిక అంశాలలో మెలకువలు తెలుస్తాయి. భవిష్యత్తులో వెయ్యి మంది విద్యార్థులు 200 మంది సిబ్బంది వస్తారు. ఫలితంగా వారికి కల్పించే మౌలిక వసతులతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది ఆధునీకరణ పట్టణంగా రూపొందుతుంది.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి