సిబ్బందికి జీతాలివ్వలేక మూతపడ్డ 5స్టార్ హోటల్

సిబ్బందికి జీతాలివ్వలేక మూతపడ్డ 5స్టార్ హోటల్

ముంబయి: కరోనా సంక్షోభం అనేక సంస్థలను దివాళా తీయిస్తోంది. ఎంతో పేరున్న ప్రముఖ సంస్థలు సైతం కరోనా లాక్ డౌన్ దెబ్బకు కస్టమర్లు రాక.. నిర్వహణ గుదిబండలా తయారవుతుంటే కోలుకోలేక.. నడవడానికి కిందా మిందా అవుతున్నాయి. మొదటి విడుత సంక్షోభం నుండి కోలుకుంటున్న తరుణంలోనే రెండో వేవ్ రావడం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రముఖ సంస్థలు దివాళా అంచుకు చేరుకుంటున్నాయి. పర్యాటకులు లేక హోటల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో లాక్ డౌన్ చాలా కాలం అమలు చేయడంతో అనేక సంస్థలు విలవిలలాడుతున్నాయి. చిన్నా చితక సంస్థలే కాదు. ప్రముఖమైనవి కూడా చేతులెత్తేస్తున్నాయి. ఇదే కోవలోనే ఫైవ్ స్టార్ హోటల్ హయత్ రీజెన్సీ సైతం తన సిబ్బందికి, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక చేతులెత్తేసింది. తాత్కాలికంగా మూసివేస్తున్నామని ప్రకటించింది. 
తాత్కాలికంగానే మూసివేత
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలోనే ఉన్న హయత్ హోటల్ నిర్వహణ భారంతో తాత్కాలికంగా మూసివేస్తున్నామన సంస్థ ప్రకటించడం హోటల్ పరిశ్రమ వర్గాల్లో తాజా పరిస్థితికి అద్దం పట్టింది. హయత్‌ రీజెన్సీ ముంబైకి మాతృ సంస్థ అయిన ఏషియన్‌ హోటల్స్‌ (వెస్ట్‌) లిమిటెడ్‌ నుంచి తమకు ఎలాంటి నిధులు రాలేదని హయత్‌ కంట్రీ హెడ్‌ తెలిపారు. సాధారణంగా కంపెనీలు నెలకొల్పే హోటల్స్‌ నిర్వహణను హయత్‌ చేపడుతుంది. తమకు మాతృ సంస్థ నుంచి ఎలాంటి నిధులు రాకపోవడానికి తోడు.. కస్టమర్లు లేక ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడిందని.. అందుకే తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి ఆదేశాలు, నిధులు వచ్చే వరకు మూసివేత కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. నిన్నటి వరకు కస్టమర్లే మా దేవుళ్లు అని ఆయా సంస్థల్లో కనిపించే ఆకర్షణీయమైన కొటేషన్ల వెనుక అర్థం పరమార్థం కరోనా వల్ల ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలా చేస్తోంది. అంతర్జాతీయంగా పేరున్న హయత్‌ హోటల్స్‌ కార్పొరేషన్‌ ముంబైలోని తమ హయత్‌ రీజెన్సి హోటల్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించడం పర్యాటక రంగంలో నెలకొన్న సంక్షోభ తీవ్రతకు నిదర్శనమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.