అడ్డగుట్టలో పర్మీషన్ లేకుండా 7 ఫ్లోర్లు వేశారు : పరారీలో అపార్ట్ మెంట్ ఓనర్లు

అడ్డగుట్టలో పర్మీషన్ లేకుండా 7 ఫ్లోర్లు వేశారు : పరారీలో అపార్ట్ మెంట్ ఓనర్లు

నిబంధనల ఉల్లంఘన నిండు ప్రాణాలను తీసింది. పర్మీషన్ ఇచ్చింది 5 అంతస్తులకు..కానీ కక్కుర్తితో మరో రెండు ఫ్లోర్లు అక్రమంగా వేస్తున్నారు.  ఫలితంగా ఆ రెండు ఫ్లోర్ల పనులు చేస్తుండగా....ప్రమాదం జరిగి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ హైదర్ నగర్ డివిజన్ అడ్డగుట్టలో దాసరి సంతోష్, దాసరి శ్రీరామ్ అనే వ్యక్తులు సర్వే నెంబర్ 176P, 177P,182Pలోని 668 గజాలలో  భారీ భవన నిర్మాణం చేపట్టారు. దీనికి కూకట్ పల్లి జీహెచ్ఎంసీ అధికారులు జీ ప్లస్ 5 అంతస్థుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. అయితే ఇప్పటికే ఐదు అంతస్తులు పూర్తి అయింది.  కానీ బిల్డింగ్ ఓనర్లు..అనుమతి తీసుకోకుండానే మరో రెండు ఫ్లోర్లు అదనంగా వేయాలని ప్లాన్ చేశారు. ఓనర్లు దాసరి సంతోష్, దాసరి శ్రీరామ్ లు... బిల్డింగ్ డెవలప్ మెంట్ నిర్మాణ పనులను బిల్డర్ శ్రీనివాస్ నాయుడుకి ఇచ్చారు. 
 
అక్రమంగా 6, 7 అంతస్తుల నిర్మాణ పనులు మొదలయ్యాయి.  ఈ రెండు అంతస్తుల స్లాబ్ పోశారు. వీటి సెంట్రింగ్ తొలగిస్తున్న క్రమంలో పక్కకు ఒరిగిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది.  దీంతో గోవా కట్టెలపై ఉండి పనిచేస్తున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన ఐదుగురు కూలీలు అక్కడి నుండి కిందకు పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ప్రైవేటు  ఆస్పత్రికి తరలించారు. ఇంకొకరు స్వల్పంగా గాయపడ్డారు. 

ALSO READ: అంగన్​వాడీ టీచర్ల డిమాండ్లను నెరవేర్చాలే: సుధారాణి

బిల్డింగ్ ప్రమాదాన్ని గురించి తెలుసుకున్న ఓనర్లు  దాసరి సంతోష్, శ్రీరామ్, బిల్డర్ శ్రీనివాస్ నాయుడు పరారయ్యారు. అక్రమంగా రెండు అంతస్తులు నిర్మిస్తున్న విషయం తెలిసిపోవడంతో ముగ్గురు పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..నిందితుల కోసం గాలిస్తున్నారు. 

అడ్డగుట్టలో కూలిపోయిన బిల్డింగ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.  గోవా కర్రలు నాణ్యత లేకపోవడం వల్లనే ఉదయం పని చేస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదంలో ముగ్గురు  మృతి చెందారని... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నామన్నారు. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని చెప్పారు.