
హైదరాబాద్‌లో వైర్లు పడి ఇద్దరు సజీవ దహనం
మృతులిద్దరు యాచకులురోడ్డు పక్కన నిద్రిస్తుండగా ప్రమాదం
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డులో ఘటన
ఎల్బీనగర్, వెలుగు:హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతల్‌కుంట వద్ద ఆదివారం (జూన్ 15) వేకువజామున హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడి ఇద్దరు సజీవ దహనమయ్యారు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై విద్యుత్ తీగలు పడడంతో ఓ మహిళ, ఓ వ్యక్తితో పాటు ఓ కుక్క కూడా సజీవ దహనమైంది. ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.
ఎల్బీ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ లోని సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తా సమీపంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఫుట్ పాత్ పై ఇద్దరు గుర్తు తెలియని యాచకులు నిద్రిస్తున్నారు. వారితో పాటు ఓ కుక్క కూడా ఉంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వెహికల్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో 11 కేవీ హైటెన్షన్ వైర్లు భారీ శబ్దంతో వారిపై తెగిపడ్డాయి.
క్షణాల్లో మంటలు చెలరేగి ఆ ఇద్దరితోపాటు కుక్క కూడా సజీవ దహనమైంది. స్థానికులు గమనించి ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. మృతి చెందిన వారిని అంబులెన్స్ లో ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కాగా, మృతుల పేర్లు, వివరాలు తెలియరాలేదు. మృతి చెందిన యాచకులు ఇద్దరూ స్థానికంగా ఉంటూ భిక్షాటన చేసి.. రోజూ రాత్రి ఈ ఎల్లమ్మ దేవాలయం వద్ద పడుకుంటారని స్థానికులు చెబుతున్నారు.
ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు అక్కడి చేరుకొని, మరమ్మతులు చేపట్టారు.