
- పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం: భట్టి
- రాష్ట్రానికి హైదరాబాద్ గేమ్ చేంజర్.. ట్రిపుల్ఆర్ పూర్తయితే ఊహకందని అభివృద్ధి అని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి హైదరాబాద్ ఒక ‘గేమ్ చేంజర్’ అని, దీనిని ‘ఫ్యూచర్ సిటీ’గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నదని, త్వరలో పరిశ్రమలకు గ్రీన్ పవర్ సరఫరా చేసే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) కొత్త కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూసీ నది పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) పనులు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఊహకు కూడా అందదని తెలిపారు. ట్రిపుల్ ఆర్, ఓఆర్ఆర్‌కు మధ్య ఐటీ, ఫార్మా, హౌసింగ్‌లాంటి అనేక క్లస్టర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నామని, వీటిని అభ్యుదయ పారిశ్రామికవేత్తలకు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.
అవకాశాలకు తలుపులు తెరిచే ఉంచుతం
తమది ప్రజా ప్రభుత్వం అని, పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు ఏ చిన్న సమస్య వచ్చినా స్పందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు యావత్ మంత్రివర్గం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. పారిశ్రామికవేత్తలు కోరినట్టు పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లుల వన్-టైమ్ సెటిల్‌మెంట్ గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని చెప్పారు.
హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అత్యంత అనుకూలమైనదని, ఇక్కడి వాతావరణం, పెద్ద ఎత్తున ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల ద్వారా లభించే నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు ఎంతమంది పెట్టుబడిదారులనైనా ఆకర్షిస్తాయని, వారికి అవకాశాలు కల్పిస్తాయని వివరించారు. సంపద సృష్టికర్తలైన పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని తెలిపారు.
హైదరాబాద్‌లాంటి ఆవిష్కరణ కేంద్రాల ద్వారా సంపదను సృష్టించి, దాన్ని న్యాయంగా, సమానంగా సమాజ నిర్మాణానికి వినియోగించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజల గౌరవాన్ని పెంపొందించడం, వారి ఆశయాలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం అని వెల్లడించారు.
డిప్యూటీ సీఎం భట్టికి రాంచందర్‌రావు లీగల్ నోటీసులు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు లీగల్ నోటీసులు పంపారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించిన అంశంలో తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఈ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.25 కోట్ల పరువునష్టం దావా వేయనున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు.